అప్పుడే ఈ రూల్ పెట్టుంటే జగన్ పాదయాత్ర చేసుండేవారా? నాగబాబు ఫైర్

ఈ సందర్భంగా రోడ్ల మీద తిరగడమో, ర్యాలీలు చేయడమో చేస్తూ ఉంటారు. వీటికి మొదటి నుంచి పోలీసుల అనుమతి ఉంది. కొత్తగా ఎవరు అనుమతులు తీసుకోరు.

Advertisement
Update:2023-01-03 22:43 IST

ఇటీవల ఏపీలోని కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోగా, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా తాము సభలు నిర్వహించకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ, జనసేన పార్టీలు విమర్శించాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు తప్పు పట్టారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు.

ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసే వాడా అని నాగబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలతో కలిసి కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ' ఏపీ గవర్నమెంట్ రోడ్ షోలు చేయకూడదని ఒక జీవో తీసుకువచ్చింది. అలా జీవో తీసుకురావడం మీ యొక్క భయాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. మనదేశంలో రకరకాల కులాల వాళ్ళు, మతాలవాళ్ళు అనేక ఉత్సవాలు, పెళ్లిళ్లు జరుపుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంగా రోడ్ల మీద తిరగడమో, ర్యాలీలు చేయడమో చేస్తూ ఉంటారు. వీటికి మొదటి నుంచి పోలీసుల అనుమతి ఉంది. కొత్తగా ఎవరు అనుమతులు తీసుకోరు. చట్టానికి కట్టుబడే సభలు నిర్వహిస్తున్నప్పుడు మీకు భయం ఎందుకు?. ఇటీవల చంద్రబాబు సభల్లో కొంతమంది చనిపోవడం దురదృష్టకరం. అయితే చంద్రబాబు రెండవ సభలో ముగ్గురు చనిపోవడంలో ఏదో కుట్ర కోణం దాగి ఉందని మా అనుమానం. అందులో ఎవరి పాత్ర ఉందో త్వరలో తెలుస్తాం.

రోడ్లపై నిర్వహించే సభలతో ప్రజలు చనిపోతున్నారన్న వంకతో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు ర్యాలీలు నిర్వహించకుండా మీరు రూల్స్ పెడతారా?. హోమ్ శాఖ అటువంటి ఉత్తర్వులు ఇస్తుందా? ఏపీలో గవర్నమెంట్ ఉందా? లేక రాచరిక వ్యవస్థ నడుస్తుందా? ప్రజల వద్దకు వెళ్లి రోడ్ షో నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు. ప్రజలకు పార్టీలు తమ భావాలు, అభిప్రాయాలు చెప్పడం రాజ్యాంగం కల్పించిన హక్కు.

జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఈ రూల్ పెట్టి ఉంటే.. ఆయన పాదయాత్ర చేయగలిగే వారా? అప్పటి టీడీపీ ప్రభుత్వం మీరు పాదయాత్ర చేసేందుకు అవకాశం కల్పించింది కదా.. ఇప్పుడు మీరు నిరంకుశంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏం హక్కు ఉంది. ఒకవేళ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా కోర్టులో నిలబడతాయా? ఇది కోర్టులో మీరు తినబోయే మరొక ఎదురుదెబ్బ.

చనిపోకుండా, జనాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సెక్యూరిటీ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. పార్టీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. పోలీసుల ద్వారా మీరు కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాన్నుంచి మీరు తప్పించుకొని అసలు సభలే నిర్వహించకూడదంటే ఎలా? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది. ఇది ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద తప్పు.

పవన్ కళ్యాణ్ ను కానీ, చంద్రబాబును కానీ మీరు ఎలా ఆపుతారు. రోడ్లమీద తిరగకూడదు అంటే సోషల్ మీడియా లేదా.. ప్రభుత్వ తప్పుల్ని ఎండగట్టే అవకాశం మాకు రాదా..? మీరు ఎంత ఆపితే పార్టీలు అంత బౌన్స్ అవుతాయి. మీరు వదిలేస్తేనే అంతో ఇంతో సేఫ్టీ మీకు. పవన్ ని, చంద్రబాబుని ఆపితే అది మీకే నష్టం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కచ్చితంగా దీనిపై అన్ని పార్టీలతో కలిసి కోర్టుకు వెళతాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. జగన్ ఆంధ్రప్రదేశ్ కు రాజు కాదు.. ముఖ్యమంత్రి మాత్రమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం.' అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News