సంక్షేమం పేరుతో వైకల్యం.. బీజేపీకి వంతపాడిన పవన్..
శ్రీలంక పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయం అంటే బూతుల పురాణం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఉచిత పథకాలు అనర్థం అంటూ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నవేళ, దేశవ్యాప్తంగా విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. సంక్షేమ పథకాలను సమర్థించకపోవడం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అడ్డుకోవడమేనంటున్నారు విపక్ష నేతలు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ నిర్ణయాన్ని సమర్థించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదంటూనే.. సంక్షేమం పేరుతో మనల్ని వైకల్యం బాట పట్టిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీలంక పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయం అంటే బూతుల పురాణం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
అందుకే రాజకీయాల్లోకి వచ్చా..
మద్యపానం నిషేధం, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇసుక ఉచితంగా ఇస్తామని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంపై పోరాటం చేయాలని, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పోరాటం మొదలు పెట్టాలన్నారు. తన భవిష్యత్ గురించి తనకు భయం లేదని, సమాజం చివరకు ఏమవుతుందోనన్న భయమే తనలో ఎక్కువగా ఉందన్నారు. బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటుంటే తట్టుకోలేక తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్. ఈ పోరాటంలో పోతే తన ప్రాణం పోతుందని, లేదంటే ఈ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. 2024 ఎన్నికలు జనసేనకు చాలా కీలకమైనవని, వచ్చే ఎన్నికల్లో జనసేన ఓ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పదవులే మనల్ని వెతుక్కుంటూ రావాలి..
పదవులకోసం మనం వెంపర్లాడకూడదని, పదవులే మనల్ని వెతుక్కుంటూ రావాలన్నారు పవన్ కల్యాణ్. మనం సమాజానికి మంచి చేయక పోయినా పర్లేదని, చెడు మాత్రం చేయకూడదని సూచించారు జనసేనాని. ప్రతి మనిషిలో మంచి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే గొప్ప దేశం మనది అని చెప్పారు పవన్. రాజకీయాలలో అనుభవం లేక పోతే వైసీపీ పాలన లాగా ఉంటుందని విమర్శించారు. భారత దేశానికి స్వాతంత్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని, అలాంటి త్యాగాలే ఇప్పుడు కూడా జరగాలన్నారు పవన్.