7 లక్షలమంది జగన్ ప్రతినిధులు.. ఈనెల 7నుంచి ఇంటింటికీ

జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు సజ్జల.

Advertisement
Update:2023-04-04 16:12 IST

అప్పుడు 'రావాలి జగన్, కావాలి జగన్'.. ఇప్పుడు 'జగనన్నే మా భవిష్యత్తు'.. వచ్చే ఎన్నికల కోసం కొత్త స్లోగన్ తో వైసీపీ రెడీ అయిపోయింది. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో వరుస కార్యక్రమాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 7 నుంచి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, గృహసారథులు.. 2వారాల పాటు జనంలోనే ఉంటారు. మొత్తం పార్టీకి చెందిన 7 లక్షలమంది ఈ రెండువారాలపాటు జనంలోనే ఉండేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తదితరులు పాల్గొన్నారు.

జనాలందరికీ జగనే భవిష్యత్తు..

జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు సజ్జల. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల ఇన్ ఛార్జులు, జోనల్ కో-ఆర్డినేటర్లు ఇలా మొత్తం యంత్రాంగం కదిలొస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకుని రావటమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు సజ్జల. ప్రతి పేద కుటుంబం.. తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా చేయడమే సీఎం జగన్ టార్గెట్‌ అని వివరించారు. ఒక రాజకీయ పార్టీ ఇంత విస్తృతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని అన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. అనే విషయాలను ప్రజలు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిపొందారని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News