ధైర్యం కోల్పోవద్దు, పార్టీకోసం కష్టపడండి.. ఎంపీలకు జగన్ సూచన

ఇదివరకటిలాగే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు జగన్.

Advertisement
Update:2024-06-14 14:07 IST

నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్, నేడు ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ లో మన బలం ఎవరికీ తక్కువ కాదని, టీడీపీకి 16మంది ఎంపీలుంటే, మనకి 11మంది రాజ్యసభ, నలుగురు లోక్ సభ సభ్యులు.. మొత్తంగా 15మంది బలం ఉందని గుర్తు చేశారు. పార్టీకోసం మీరు కష్టపడితే పార్టీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుందని వివరించారు జగన్.


ఉమ్మడి నిర్ణయాలు..

ఇదివరకటి లాగే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు జగన్. అందరికీ తాను అందుబాటులో ఉంటానన్నారు. ఎంపీలంతా కలసి కూర్చుని చర్చించుకుని ముందడుగు వేయాలన్నారు. వారు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలన్నారు. పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలని ఎంపీలకు సూచించారు జగన్. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతిస్తామని, పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని చెప్పారు.

కష్టాలు తాత్కాలికం..

2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియనట్టుగా ఉందని, ఈసారికూడా అలాగే జరుగుతుందని, ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని ఎంపీలకు ధైర్యం చెప్పారు జగన్. రాజకీయంగా నేతలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం అని అన్నారాయన. వైసీపీ పాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయన్నారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని ఎంపీలకు హితవు పలికారు. 2019తో పోల్చి చూస్తే 2024లో వైసీపీకి10 శాతం ఓట్లు తగ్గాయని, రాబోయే రోజుల్లో ఆ 10శాతం ప్రజలే పాలనలో తేడాను గుర్తించి తిరిగి తమవైపే వస్తారన్నారు జగన్. 

Tags:    
Advertisement

Similar News