ఆఫీసులూ, అధికారుల చుట్టూ తిరగకుండా, లంచాలూ, పైరవీలు లేకుండా..
గ్రామాల్లో ప్రతి 2 వేల మందికి ఒక గ్రామ వలంటీర్, పట్టణాల్లో ప్రతి 4 వేల మందికి ఒక వార్డు వలంటీర్ బాధ్యత వహిస్తాడు. తమ ప్రాంతాల్లో శానిటేషన్ దగ్గరి నుంచి పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ వంటి బాధ్యతలను గ్రామ వలంటీర్ తీసుకుంటాడు.
35 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 540 సేవలను ప్రజలకు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థకు 2019లో శ్రీకారం చుట్టింది. ప్రజలకు సేవలను ఇంటి ముంగిటనే అందించడానికి ఈ వ్యవస్థ నిర్విఘ్నంగా పనిచేస్తూ వస్తోంది. పాలనలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను అది ప్రతిబింబించింది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ, వార్డు వలంటీర్లను వాటికి అనుసంధానం చేశారు. పబ్లిక్ సర్వీసెస్ డెలివరీలో, అంటే ప్రభుత్వ సేవల పంపిణీలో ప్రజలు నేరుగా సంక్షేమ ఫలితాలను అందుకోవడానికి వీలుగా ఈ వ్యవస్థ పనిచేస్తూ వస్తోంది.
గ్రామాల్లో ప్రతి 2 వేల మందికి ఒక గ్రామ వలంటీర్, పట్టణాల్లో ప్రతి 4 వేల మందికి ఒక వార్డు వలంటీర్ బాధ్యత వహిస్తాడు. తమ ప్రాంతాల్లో శానిటేషన్ దగ్గరి నుంచి పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ వంటి బాధ్యతలను గ్రామ వలంటీర్ తీసుకుంటాడు. పాలనను మెరుగు పరిచి, అత్యంత వేగంగా ప్రజలకు సేవలు అందించడంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ అత్యంత మెరుగ్గా పనిచేస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కూడా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించేందుకు మాత్రమే వాటి ఏర్పాటు జరిగింది. ఫలితాలను ప్రజలకు అందించడంలో అవి విఫలమయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య వైరుధ్యానికి ఆ వ్యవస్థ దారి తీసింది. రాజకీయ నాయకులకు, అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉదాహరణకు, గ్రామ సర్పంచ్‌కు, గ్రామ కార్యదర్శికి మధ్య ఎడతెగని తగాదాలు చోటు చేసుకున్నాయి. దానివల్ల అవి ఫలితం ఇవ్వలేదు. ఫలితాలు ఇచ్చే విధంగా పటిష్టమైన విధానాన్ని చంద్రబాబు రూపొందించలేకపోయారు. అలా రూపొందించాలనే చిత్తశుద్ధి, నిజాయితీ కూడా చంద్రబాబుకు లేదు. పక్కా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏర్పాటు చేయడం వల్ల అవి పనిచేయలేదు. దానికి చంద్రబాబు సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) అని పేరు పెట్టారు. నిజానికి గుడ్ గవర్నెన్స్ అనేది క్యాచీ వర్డ్ కానీ అది దుష్పరిపాలనగా రూపుదాల్చింది. ప్రజలకు కొత్త తలనొప్పులను, కొత్త అధికార కేంద్రాలను తెచ్చి పెట్టింది.
జగన్ మాత్రం పక్కాగా ప్రజలకు సేవలను అందించాలనే చిత్తశుద్దిని, నిజాయితీని ప్రదర్శించారు. అందువల్ల వలంటీర్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తోంది. ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో వలంటీర్ వ్యవస్థ చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా తయారైంది, ఒక రకంగా వలంటీర్ వ్యవస్థ కూడా ప్రభుత్వ వ్యవస్థనే. వలంటీర్ల నియమకాలు ఆయా ప్రభుత్వ శాఖలు చేపడుతున్నాయి. వారికి నెలకు 5 వేల రూపాయల ప్రభుత్వ వేతనం కూడా లభిస్తోంది. అందువల్ల అది జగన్ సొంత వ్యవస్థ గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గానీ కాదు. ఈ విషయాన్ని గుర్తించకపోవడం వల్లనే, గుర్తించడానికి వీలైన సమాధానం చెప్పలేకపోవడం వల్లనే ఆ వ్యవస్థ సేవలకు బ్రేక్ పడింది.
వైఎస్ జగన్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వలంటీర్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తుండడం వల్లనే తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, తదితర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి. ప్రజల ఆహార, సామాజిక, ఆరోగ్య భద్రతలకు వలంటీర్ వ్యవస్థ గ్యారంటీ ఇస్తోంది. ఈ వలంటీర్ వ్యవస్థ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కూడా అందుకుంది.
పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు చేసిన ఫిర్యాదులను ఆలకించి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి జగన్ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. తాము పింఛన్ వంటి ప్రయోజనాలను పొందడానికి ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగే విధంగా తిరగాల్సి వస్తోందని వారు ఫిర్యాదు చేశారు. అందుకే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
రేషన్ కార్డుల వంటివాటిని పొందడానికి కూడా ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏయే ప్రయోజనాలు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంత కాలానికి అందుబాటులోకి వస్తాయనే కాలపరిమితి కూడా పెట్టారు. దరఖాస్తు చేసుకునే వెసులబాటును కూడా సులభతరం చేశారు. వలంటీర్లు అందుకు సహకరిస్తారు. పెన్షన్, బియ్యం కార్డులు 21 రోజుల లోపల వచ్చేస్తాయి. ఆరోగ్యశ్రీ కార్డులు 20 రోజుల్లోగా అందుతాయి. ఇంటి పట్టాలు 90 రోజుల్లోగా వస్తాయి. రేషన్ పంపిణీ రాష్ట్రమంతా రెండు రోజుల్లో పూర్తవుతుంది. ప్రతి నెలా ఒకటి, మూడు తేదీల మధ్య ఇది జరిగిపోతుంది.
జగన్ ప్రభుత్వంలోని వలంటీర్ వ్యవస్థ జవాబుదారీతనానికి, సేవల పంపిణీలో వేగానికి పెట్టింది పేరుగా మారింది. ఇంత పకడ్బందీగా పారదర్శకంగా పని చేస్తున్న వలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల వైఖరి ఉండడం విశేషమేమీ కాదు. ఇంత సరళతరమైన, జవాబుదారీతనంతో కూడిన విధానాన్ని ప్రజలు ఇంత వరకు రుచి చూడలేదు. అందుకే జగన్ పట్ల ప్రజలు ప్రేమను, అనురాగాన్ని పెంచుకున్నారు.