వైసీపీలో ఐప్యాక్ డామినేషన్ పెరిగిపోతోందా..?

మూడురాజధానులకు మద్దతుగా కర్నూలులో సోమవారం జరగబోయే సీమగర్జన కార్యక్రమం నిర్వహణలో కూడా ఐప్యాక్ ప్రతినిధులదే పెత్తనమట.

Advertisement
Update:2022-12-05 09:45 IST

రాజకీయ పార్టీలపై వ్యూహకర్తల ప్రభావం పెరిగిపోతోంది. ఒకప్పుడు ఎంతటి వ్యూహాలనైనా, కార్యక్రమాలను అయినా పార్టీల అధినేతలు లేదా ముఖ్యనేతలు మాత్రమే చూసుకునేవారు. కానీ, ప్రస్తుత కాలంలో అధినేతలకు సలహాలు, సూచనలు ఇవ్వటానికి ప్రత్యేకంగా వ్యూహాకర్తల అవసరం వచ్చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటంలో ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరవెనుక పోషించిన పాత్ర బాగా హైలైట్ అయ్యింది. అప్పటినుంచి పీకేకి ప్రధాన్యత పెరిగిపోవటంతో పోటీగా మరింతమంది వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు.

మిగిలిన రాష్ట్రాల సంగతి వదిలేస్తే 2019 ఎన్నికల్లో పీకేతో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. దాంతో ఇప్పటికీ జగన్ ఐప్యాక్ సేవలను కంటిన్యు చేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే పార్టీపై ఐప్యాక్ బృందం డామినేషన్ పెరిగిపోతోందట. మంత్రులు, ఎంఎల్ఏలు, నియోజకవర్గాల ఇన్చార్జిల పనితీరును ఐప్యాక్ సమీక్షిస్తుండటం, సర్వేలు చేస్తుండటంతో ఐప్యాక్ బృందమంటే పార్టీలో ఒకవిధమైన బెరుకు పెరిగిపోతోందట. ఐప్యాక్ నివేదికలకు జగన్ బాగా ప్రాధాన్యత ఇస్తుండటంతో నేతలు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.

మూడురాజధానులకు మద్దతుగా కర్నూలులో సోమవారం జరగబోయే సీమగర్జన కార్యక్రమం నిర్వహణలో కూడా ఐప్యాక్ ప్రతినిధులదే పెత్తనమట. ఎవరేం మాట్లాడాలి, బహిరంగసభలో ఎలాంటి స్లోగన్లు ఇవ్వాలి, పోస్టర్లపై ఎలాంటి నినాదాలుండాలి, బహిరంగసభ విజయవంతం అవ్వాలంటే నేతలు పోషించాల్సిన పాత్రను కూడా ఐప్యాక్ బృందమే నిర్దేశిస్తోందట. ఒకరకంగా చెప్పాలంటే జగన్ చేయాల్సిన పనిని పీకే బృందం చేస్తోందని అర్థ‌మవుతోంది.

దీన్ని మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. కానీ తమలోని అసంతృప్తిని బయటకు చెప్పుకోలేక అవస్థ‌లు పడుతున్నారు. ఎందుకంటే స్వయంగా జగనే పీకే బృందానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తాము గట్టిగా మాట్లాడితే కొంపలు ముణిగిపోతాయని భయపడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్లను ఫైనల్ చేయటంలో జగన్ ఐప్యాక్ సర్వేలపైనే ఆధారపడ్డారు. ఈ విషయం తెలియటంవల్లే నేతలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఏదేమైనా వైసీపీలో ఐప్యాక్ డామినేషన్ పెరిగిపోతోందన్నది వాస్తవం.

Tags:    
Advertisement

Similar News