చంద్రబాబు `పూర్ టు రిచ్` రీచ్ పూర్‌గా ఉందా?
పేదలలో చాలా మంది నిరక్షరాస్యులు. వారికి ఇంగ్లిష్‌లో `పూర్ టు రిచ్` క్యాప్షన్‌తో విషయం అర్థం అయ్యేలా ఎలా చేయగలరనేది ఇప్పుడు టీడీపీ పెద్దలకి పెద్ద సవాలే.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో గురించి మరోసారి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ మేనిఫెస్టోలో పెట్టిన `పూర్ టు రిచ్` విధానం వినూత్నమైందని, దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా.. ఆచరణలో ఇది అద్భుత ఫలితాలనిస్తుందన్నారు. అందరూ అనుకున్నట్టే.. ఉత్తరాది వ్యూహకర్తలు ఇచ్చిన ఈ స్కీమ్ పేరు వల్లే సామాన్య ప్రజలకు కనెక్ట్ కాలేదని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమైంది.
పేదలలో చాలా మంది నిరక్షరాస్యులు. వారికి ఇంగ్లిష్‌లో `పూర్ టు రిచ్` క్యాప్షన్‌తో విషయం అర్థం అయ్యేలా ఎలా చేయగలరనేది ఇప్పుడు టీడీపీ పెద్దలకి పెద్ద సవాలే. పూర్ టు రిచ్ నినాదమే పేదలకు చేరదు. దీని వెనుక ఉన్న అర్థం పీ4 పేదలకి మరింత గందరగోళం. పీ4 అంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రయివేటు, పార్టనర్ షిప్. ఇది నిరక్షరాస్య నిరుపేదలలోకి ఎలా తీసుకెళ్లాలో తెలియక టీడీపీ కేడర్ అయోమయానికి గురవుతోంది. పేదలని ధనవంతుల్ని చేస్తామని చెప్పొచ్చు. కానీ, వ్యూహకర్తలు తాము పెట్టిన క్యాప్షన్ చుట్టూ తాము తిరుగుతూ పార్టీలని తిప్పుతారు. పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైందని అధినేత చంద్రబాబే ఒప్పుకున్నారంటే.. ఈ హామీ చదువరులకి కూడా అర్థం చేసుకోలేనంత సంక్లిష్టంగా ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరం అంటున్న చంద్రబాబు ..పేదలు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే సంపాదించగలుగుతున్నారని అన్నారు. సంపద సృష్టి ద్వారా అది మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పేదలని సంపన్నులని చేయాలనే లక్ష్యాన్ని పూర్ టు రిచ్ నినాదం పేదలకి ఎలా చేరువవుతుందనేది ఇప్పుడు ప్రశ్న.