దాడులు, ప్రతి దాడులు.. ఏపీలో రక్తసిక్తంగా రాజకీయాలు..
రెండురోజులకే ఇటు విజయవాడలో మాజీ కార్పొరేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై భౌతిక దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కుడికన్ను కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇటీవల కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ పీఏపై దాడి జరిగింది. రక్త గాయాలయ్యాయి. దానికి కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్షనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ నేతలు దాడి చేశారని, వైసీపీ నేతలంటుంటే.. లేదు లేదు వైసీపీలో అంతర్గత కలహాల వల్లే భరత్ పీఏ తల పగిలిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం జరిగిన రెండురోజులకే ఇటు విజయవాడలో మాజీ కార్పొరేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై భౌతిక దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కుడికన్ను కోల్పోయినట్టు తెలుస్తోంది. రక్తమోడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏపీలో ఇప్పటి వరకూ రాజకీయ దాడులు మాటల వరకే పరిమితం అయ్యాయి. ఆ మాటలు కూడా ఒక్కో దశలో శృతి మించాయనే చెప్పాలి. చంద్రబాబు సింపతీకోసం ఏడ్చారనుకున్నా, నిజంగానే బాధపడి ఏడ్చారనుకున్నా.. ఏపీలో ఈ మూడేళ్లలో వినిపించిన అసభ్య పదాలు, అనరాని మాటలు.. గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ నోటివెంటా వినపడిన దాఖలాలు లేవు. ఆ మాటలు ఇప్పుడు చేతల వరకు వచ్చాయి. దాడులు జరుగుతున్నాయి. తాజాగా చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి ఘటన మరింత కలవరం కలిగిస్తోంది. గాంధీ భార్య ప్రస్తుతం విజయవాడలో ఓ డివిజన్ కి కార్పొరేటర్. ఆమె చేతిలో ఓటమిపాలైన వైసీపీ నాయకులు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెచ్చగొట్టే మాటలెందుకు..?
రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు నాయకులు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నారు నాయకులు. పోరాడే నాయకులు మరింతమంది కావాలంటూ ఇటీవల చంద్రబాబు ఇచ్చిన పిలుపుని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. మీరు జైలుకెళ్తే, మేం విడిపించుకు వస్తామంటూ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చి మరీ గొడవలకు దిగాలనడం ఏం సంప్రదాయం అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. జనసేన జెండా దిమ్మెల గొడవ కూడా ఇలాంటిదే. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికలకు రెండేళ్లముందుగానే ఏపీలో మొదలైన ఈ దాడుల సంస్కృతి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.