మంత్రి పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా..? వైసీపీ ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి గతంలో తాను వైసీపీలోకి వచ్చానని గుర్తుచేసిన ఆయన, అలాంటి తాను మళ్లీ టీడీపీలోకి ఎందుకు వెళ్తానన్నారు. పదే పదే అబద్ధాలు చెప్పి, అవే నిజాలని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు
ఏపీలో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా జగన్ కి దూరమవుతున్నారని, ఆయన త్వరలో సొంత గూటికి చేరుకుంటారని, టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే కథనాలు వినపడుతున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో రగిలిపోతున్న ఆయన, పార్టీ ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలన్నీ కల్పితాలేనంటూ కొట్టిపారేశారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. గత ఎన్నికకు ముందు టీడీపీనుంచి వైసీపీలోకి వచ్చేసిన ఆయన, ఈసారి తాను పార్టీ మారేది లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.
అది చంద్రబాబుకి అలవాటే..
పదే పదే అబద్ధాలు చెప్పి, అవే నిజాలని ప్రచారం చేయడం చంద్రబాబుకు మామూలే అని మండిపడ్డారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. తాను కూడా అదే స్కూల్ స్టూడెంట్ ని అని చెప్పారు. లోకేష్ భవిష్యత్తు పై చంద్రబాబు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. లోకేష్ కి బుర్ర లేదని, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, అది ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. తాను టీడీపీలో చేరుతున్నానని కొన్ని చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి గతంలో తాను వైసీపీలోకి వచ్చానని గుర్తుచేసిన ఆయన, అలాంటి తాను మళ్లీ టీడీపీలోకి ఎందుకు వెళ్తానన్నారు.
మంత్రి పదవిపై అసంతృప్తి ఉందా..?
రెండు విడతల్లో కూడా మంత్రి పదవి రాకపోవడంతో శిల్పా చక్రపాణి రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం వాస్తవమే. అందుకే ఆయన కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. కానీ ఆయన మాత్రం పార్టీ మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చ.. తనకు పదవి ముఖ్యం కాదని, పదవి రాకపోయినా ఎప్పుడూ అసంతృప్తి చెందలేదని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందరికీ న్యాయం చేస్తారని నెలాఖరులోగా ఉద్యోగులకు కూడా శుభవార్త చెబుతారనే నమ్మకం తనకు ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే కలసి ప్రయాణం చేస్తానన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి.