టీడీపీ-బీజేపీ కలిస్తే ఏమవుతుంది?

ఏపీలో టీడీపీకి రాజకీయంగా మద్దతుగా ఉండాలని బీజేపీ నిర్ణయిస్తే.. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అప్పుల విషయంలో కేంద్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.

Advertisement
Update:2022-08-08 19:45 IST

ఢిల్లీలో చంద్రబాబు- నరేంద్రమోడీ ఐదు నిమిషాల చిట్‌చాట్‌ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ భేటీని వైసీపీ కూడా సీరియస్‌గానే తీసుకుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి బీజేపీ- టీడీపీ మధ్య జరుగుతున్న ఒప్పంద ప్రతిపాదనపై ఒక అంచనాను కూడా వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీకి మద్దతుగా తాము నిలబడుతాం.. ఏపీ వరకు మాకు మద్దతుగా ఉండండి అన్న ప్రతిపాదనను టీడీపీ బీజేపీ ముందు ఉంచిందని.. దీనిపై నాలుగైదు నెలల నుంచే చర్చలు నడుస్తున్నాయని కూడా సజ్జల చెప్పారు. ఒకవేళ బీజేపీ- టీడీపీ కలిస్తే ఇప్పటికిప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అన్న దానిపై చర్చ నడుస్తోంది.

ఏపీలో టీడీపీకి రాజకీయంగా మద్దతుగా ఉండాలని బీజేపీ నిర్ణయిస్తే.. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అప్పుల విషయంలో కేంద్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది. టీడీపీతో కలిస్తే మాత్రం అప్పులపై ఆంక్షలను విధించవచ్చు. అప్పుడు ఏపీ ప్రభుత్వ మనుగడ, పథకాల అమలు కష్టంగా మారే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ మద్దతు లభిస్తే టీడీపీ, దాని విభాగాలు మరింత దూకుడుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవచ్చు. ఆస్తుల కేసులో జగన్‌ను కోర్టుకు రప్పించి.. తిరిగి దానిపై చర్చ జరిగేలా చేయవచ్చు. తీరా ఎన్నికల సమయంలో వైసీపీని మరింత కట్టడి చేసే ప్రయత్నాలు సాగవచ్చు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కయ్యం పెట్టుకోవడం వల్ల ఎన్నికల సమయంలో డబ్బులు కూడా బయటకు తీయలేకపోయారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వైసీపీకి ఎదురుకావొచ్చు. అయితే ఒకవేళ ఇలాంటి పరిణామాలే ఏర్పడితే ప్రజల్లో వైసీపీపై సానుభూతి పెంచినా ఆశ్చర్యం లేదు.

Tags:    
Advertisement

Similar News