జగన్ పై హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

పులివెందుల ఎమ్మెల్యే.. అంటూ జగన్ ని వెటకారం చేశారు హోం మంత్రి అనిత. మాజీ సీఎం కాబట్టి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు.

Advertisement
Update: 2024-07-21 10:27 GMT

అధికారం కోల్పోయిన నెల రోజులకే జగన్ కి మైండ్ పనిచేయట్లేదని ఎద్దేవా చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే వేధించేవారని, ఇప్పుడు జగన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆమె ప్రశ్నించారు. వినుకొండ ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు అనిత.


ఎన్నికల తర్వాత ఏపీలో 4 రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారని అన్నారు హోం మంత్రి అనిత. కానీ జగన్ మాత్రం 36 హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారని, ఆయన వద్ద వివరాలుంటే ఇవ్వాలన్నారు. ఒకవేళ ఆయన వివరాలు ఇవ్వకపోతే అది తప్పుడు ఆరోపణ అని రుజువైనట్టేనని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు అనిత. ఇంకా జగన్ మాటల్ని ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారా..? అని ప్రశ్నించారామె.

పులివెందుల ఎమ్మెల్యే.. అంటూ జగన్ ని వెటకారం చేశారు హోం మంత్రి అనిత. జగన్ వాహనం గురించి సాక్షి అనే పాంప్లేట్ పేపర్లో అవాస్తవాలు ప్రచురించారన్నారు. మాజీ సీఎం కాబట్టి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఎద్దేవా చేశారు. 2019లో అధికారం కోల్పోయాక చంద్రబాబుకి టాటా సఫారీ ఇచ్చారని, ఇప్పుడు జగన్ కి కూడా అదే ఇచ్చామని, ఇందులో వింతేముందని అన్నారు. టాటా సఫారీలో వెళ్తే జగన్ హావభావాలు ప్రజలకు కనపడవని, అందుకే ఆయన ఆ కారు దిగి ప్రైవేట్ కారు ఎక్కారన్నారు. అయినా కూడా ఆ టాటా సఫారీ ఆయన వాహన శ్రేణిలోనే ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఆయన ప్రైవేట్ కారు ఎక్కారన్నారు హోం మంత్రి అనిత. 

Tags:    
Advertisement

Similar News