అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు

ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచే పడుతున్న వాన

Advertisement
Update:2024-10-14 09:27 IST

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. తిరుమలలో పడుతున్న భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట, కోవూరి, కొడవలూరు మండలాల్లో ఎడతెరిపిలేకుండా భారీగా వర్షం కురుస్తున్నది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. డివిజన్‌, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్‌ చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు, మద్దిపాడు, గిద్దలూరు, కోమరోలులో విరామం లేకండా వర్షం పడుతున్నది. పొద్దున్న నుంచే కురుస్తున్న భారీ వర్షంతో ఒంగోలు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, కొల్లూరు, వేమూరు, అద్దంకి, యుద్ధనపూడి, జె.పంగులూరు, బల్లికురవ, నిజాంపట్నం, కర్తపాలెంలో వర్షం పడుతున్నది. కృష్ణ జిల్లా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డలో ఈదురు గాలులతో వర్షం పడుతున్నది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అన్నమయ్య జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News