భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారంతో ఐదుగురు మృతి చెందడంపై విచారం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారంతో ఐదుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, చికిత్స వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆలయ ధ్వంసం ఘటనను ఖండించారు. కదిరినాథునికోట అభయాంజనేయస్వామి ఆలయంపై దాడిపై విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.