ఫెయిలైనట్లు ఒప్పుకున్నారా..?

24 సీట్లను తీసుకున్న తనను టార్గెట్ చేస్తున్నవారికి సమాధానంగా తాడేపల్లిగూడెం బహిరంగసభలో పై ప్రశ్నలను సంధించారు. పవన్ సంధించిన ప్రశ్నలన్నీ నిజాలే అనటంలో అనుమానం లేదు.

Advertisement
Update:2024-02-29 10:48 IST

ఎన్నికల్లో ఖర్చుచేయగల అభ్యర్థులున్నారా?

వెయ్యిమందిని పోలింగ్ బూత్ కు తీసుకొచ్చే కార్యకర్తలున్నారా?

పార్టీ గెలుపు కోసం పనిచేసేంత యంత్రాగముందా?

వైసీపీ అభ్యర్థులను తట్టుకుని నిలబడగలిగిన నేతలు జనసేనలో ఉన్నారా?

అందుకనే ఇవన్నీ ఆలోచించే పొత్తులో 24 సీట్లకు అంగీకరించినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. పొత్తులో జనసేన 24 సీట్లకు మాత్రమే పరిమితమవ్వటంపై వస్తున్న వార్తలు, జరుగుతున్న ట్రోలింగును పవన్ తట్టుకోలేకపోతున్నట్లు అర్థ‌మవుతోంది. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని 24 సీట్లకే అంగీకరించారని, 24 సీట్లను తీసుకుని కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టారనే ఆరోపణలతో పవన్ మండిపోతున్నారు. తన నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి ఓ పనికిమాలిన లాజిక్కు వినిపించారు.

24 సీట్లను తీసుకున్న తనను టార్గెట్ చేస్తున్నవారికి సమాధానంగా తాడేపల్లిగూడెం బహిరంగసభలో పై ప్రశ్నలను సంధించారు. పవన్ సంధించిన ప్రశ్నలన్నీ నిజాలే అనటంలో అనుమానం లేదు. అయితే పార్టీపెట్టి పదేళ్ళయినా పార్టీ ఇంత బలహీనంగా ఉండటానికి కారణం ఎవరు..? జనాల్లో పార్టీ చొచ్చుకుపోకపోవటానికి కారణం తానే అన్న విషయాన్ని పవన్ మరచిపోయారు. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేసిన పవన్ మరి 2019 ఎన్నికల్లో 137 సీట్లకు ఎందుకు పోటీచేశారో సమాధానం చెప్పగలరా..? ఇప్పటికన్నా పార్టీ పరిస్థితి 2019లో ఇంకా అధ్వాన్నంగా ఉంది కదా. మరప్పుడు 137 సీట్లలో ఎందుకు పోటీచేసినట్లు..?

ఎందుకంటే.. అప్పట్లో చంద్రబాబునాయుడు వ్యతిరేక ఓట్లలో చీలిక తేవటానికే అని మంత్రుల ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. అప్పట్లో చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లను చీలకుండా ఉండేందుకే పవన్ ప్రయత్నిస్తున్నట్లు మంత్రుల ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. పార్టీ పెట్టి పదేళ్ళయినా ఇప్పటివరకు గ్రామస్థాయి కమిటీలు కూడా వేయకపోవటం పవన్ చేతకానితనమే. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పార్టీకి అసలు కమిటీలే లేవు. కమిటీలను ఎవరు వేయద్దన్నారు? ఎందుకు వేయలేదు?

జనాలను పోలింగ్ బూత్ వ‌ర‌కు తీసుకొచ్చే కార్యకర్తలు లేరంటే అది పవన్ ఫెయిల్యూరే. జనసేనలో ఉన్నది పవన్ అభిమానులే కానీ, కార్యకర్తలు కాదు. పవన్ చిత్తశుద్ధి మీద నమ్మకంలేకే ఇతర పార్టీల్లోని నేతలు జనసేనలో చేరలేదు. ఇతర నేతలదాకా ఎందుకు కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు ఎంతమందున్నారు పార్టీలో. ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీలో టికెట్లు దక్కలేదు కాబట్టి ఓ నలుగురు పార్టీలో చేరారు. లేకపోతే జనసేన పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేదనటంలో సందేహంలేదు. కాబట్టి తన ప్రశ్నలకు ఇతరులు సమాధానం చెప్పటంకాదు నిజాయితీగా పవనే విశ్లేషించుకుంటే సమాధానం దొరుకుతుంది.

Tags:    
Advertisement

Similar News