పులివెందులలో కాల్పుల కలకలం.. వివేకా హత్య కేసుతో సంబంధం..!
భరత్ వద్ద తుపాకీ ఎందుకు ఉందనేదే అసలు ప్రశ్న. భరత్ కి తుపాకీ లైసెన్స్ ఉందా, అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
పులివెందులలో తుపాకీ మోత మోగింది. ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పులివెందులలో భరత్ కుమార్ అనే వ్యక్తి దిలీప్, మహబూబ్ భాషా అనే ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణం అని ప్రాథమికంగా తెలిసినా అసలు భరత్ కుమార్ దగ్గరకు తుపాకీ ఎలా వచ్చిందనేదే అసలు ప్రశ్న. ప్రస్తుతం పరారీలో ఉన్న భరత్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎవరీ భరత్ కుమార్..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ సమీప బంధువే భరత్ కుమార్ యాదవ్. వివేకా హత్య కేసులో భరత్ ని కూడా సీబీఐ ప్రశ్నించింది. అప్పట్లో సీబీఐపై కూడా భరత్ ఆరోపణలు చేశాడు, సునీత భర్త రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశాల్లో చెప్పేవాడు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. భరత్ కుమార్ తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం మరో విశేషం.
పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈరోజు కాల్పుల ఘటన జరిగింది. దిలీప్, మహబూబ్ భాషా ఇద్దరూ బుల్లెట్ గాయాలతో కుప్పకూలడంతో భరత్ కుమార్ అక్కడినుంచి పరారయ్యాడని అంటున్నారు. భరత్ వద్ద తుపాకీ ఎందుకు ఉందనేదే అసలు ప్రశ్న. భరత్ కి తుపాకీ లైసెన్స్ ఉందా, అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.