అర్చకులకు గుడ్ న్యూస్..

అర్చకుల జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతోంది.

Advertisement
Update:2024-08-28 08:25 IST

ఏపీ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ చంద్రబాబు అర్చకుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆమేరకు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. అర్చకుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని తెలిపారు.


నెలకు రూ.10వేలు వేతనం తీసుకునే అర్చకులకు ఇకపై రూ.15వేలు ఇస్తారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5వేల నుంచి 10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. వేద విద్యను అభ్యసించి ఆలయాల్లో అర్చకత్వం అవకాశం రానివారికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25వేలు చేస్తామన్నారు. టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో జరగాల్సిన పనుల్లో ఇంకా ప్రారంభం కాని వాటిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దేవాలయ ఆస్తుల పరిరక్షణపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయబోతోంది. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటారు. ప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు మరిన్ని నిబంధనలు తీసుకు రాబోతున్నారు. ఇక దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులకు సంబంధించి అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి ఆనం, అధికారులతో జరిగిన సమావేశంలో.. పలు కీలక విషయాలు వెల్లడించారు సీఎం చంద్రబాబు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రచారం కల్పించేందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. 

Tags:    
Advertisement

Similar News