టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
పట్టాభి, టీడీపీ నేతలు తనకు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని సీఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించారని సీఐ కనకారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కి గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 11 మందికి కూడా రిమాండ్ విధిస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
పట్టాభి, టీడీపీ నేతలు తనకు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని సీఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించారని సీఐ కనకారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా, మరో 13 మందిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
రిపోర్ట్ పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం, అనంతరం ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. పట్టాభి నిన్నటి నుంచి కనిపించడంలేదంటూ సాగిన ఆందోళనలకు కోర్టులో ప్రవేశపెట్టడంతో చెక్ పెట్టారు పోలీసులు.