ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోడీతో చెప్పించు.. బాబుకు మాజీ మంత్రి వడ్డే సవాల్
నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదమని భావిస్తుంటే ఆ యాక్ట్‌ను రద్దు చేస్తామని చంద్రబాబు మోడీతో చెప్పించగలరా అని వడ్డే శోభనాద్రీశ్వరరావు సవాల్ చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని ప్రధాని మోడీతో చెప్పించాలని సవాల్ చేశారు.
సిఫార్సు చేసింది కేంద్రమే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది కేంద్ర ప్రభుత్వమేనన్న వడ్డే దాన్ని టీడీపీ లోలోపల మద్దతు పలుకుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఈ యాక్ట్‌ను ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మద్దతు పలికారని గుర్తుచేశారు. టీడీపీ దీన్ని సపోర్ట్ చేస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
విజయవాడ రోడ్‌షోలో చెప్పించు
నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదమని భావిస్తుంటే ఆ యాక్ట్‌ను రద్దు చేస్తామని చంద్రబాబు మోడీతో చెప్పించగలరా అని వడ్డే శోభనాద్రీశ్వరరావు సవాల్ చేశారు. విజయవాడలో ఈ రోజు జరగనున్న మోడీ రోడ్‌షోలో ఈ మాట ఆయనతో చెప్పించండి అని సూచించారు.
బాబు తీరుపై సొంత పార్టీ నేతల్లో ఆందోళన
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే అన్నట్లు కూటమి నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తెచ్చిన చట్టమని అందరికీ తెలుసు. అయినా పదేపదే దుష్ప్రచారం చేయడాన్ని చంద్రబాబు సొంత పార్టీ నేతలే కాదు ఆయన సామాజికవర్గ ప్రముఖులు కూడా లోపల్లోపలే వ్యతిరేకిస్తున్నారు. ఈ యాక్ట్ తెచ్చిన మోడీతో అంటకాగుతూ.. తప్పును జగన్ మీదకు నెడుతున్నామని, అది మిస్‌ఫైర్ అవుతుందేమోనని భయపడుతున్నారు.