టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపడితే చంద్రబాబు ఏం చేస్తారు..?
జూనియర్ ఎన్టీఆర్.. తన తాత పెట్టిన పార్టీని తీసేసుకుంటే.. చంద్రబాబుకి ప్రత్యామ్నాయం లేదని, ఆయన బాబు టీడీపీ పెట్టుకోవాల్సిందేనన్నారు.
ఎన్టీఆర్ నుంచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసేసుకోవడంతో హరికృష్ణ అన్నా టీడీపీ అని, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అని పార్టీలు పెట్టుకున్నారు. ఆ తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయాయి, టీడీపీ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు కొత్తగా బాబు టీడీపీ కూడా తెరపైకి వస్తుందని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్.. తన తాత పెట్టిన పార్టీని తీసేసుకుంటే.. చంద్రబాబుకి ప్రత్యామ్నాయం లేదని, ఆయన బాబు టీడీపీ పెట్టుకోవాల్సిందేనన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ జనసేన, చంద్రబాబు కొత్త పార్టీ పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేస్తాయని కూడా సెటైర్లు వేశారు నాని.
ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు..
ఇంతకీ ఎన్టీఆర్ టీడీపీని ఎప్పుడు టేకోవర్ చేసుకుంటారనే విషయాన్ని కూడా ఆసక్తికరంగా చెప్పారు కొడాలి నాని. ఇటీవల లక్ష్మీపార్వతి కూడా మనవడ్ని రాజకీయాల్లోకి రమ్మన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. లక్ష్మీపార్వతి అడిగారనో, తాను అడిగాననో ఎన్టీఆర్, టీడీపీ పగ్గాలు చేపట్టరని, ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు, తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా జూనియర్.. టీడీపీని హస్తగతం చేసుకుంటారని చెప్పారు. దానికి తొందరెందుకని అన్నారు.
2024లో వారి పీడ విరగడవుతుంది..
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేయడం ఖాయమంటున్నారు కొడాలి నాని. ఆ రెండు పార్టీలు ఓడిపోవడంతోపాటు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ డిపాజిట్లు కూడా రావన్నారు నాని. 2024 ఎన్నికలతో ఆ ఇద్దరి పీడ విరగడవుతుందని జోస్యం చెప్పారు. 2024లో వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ టీడీపీతో కలసి వచ్చినా, టీడీపీ జనసేనతో కలసి వచ్చినా, ఆ మూడు పార్టీలు మూటగట్టుకుని వచ్చినా జగన్ ఒంటి చేత్తో అందర్నీ కలిపి ఓడిస్తారని అన్నారు నాని.