శ్రీధర్ రెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తీసుకొస్తాం..

జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని తాను నిరూపించేందుకు సిద్ధమని, అలా నిరూపిస్తే శ్రీధర్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు.

Advertisement
Update:2023-02-01 16:08 IST

తన ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి సైలెంట్ గా వెళ్ళిపోకుండా ఏంటి ఈ రచ్చ అని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో టేప్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని తాము నిరూపించేందుకు సిద్ధమన్నారు .

సదరు ఫోన్ కాల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో మాట్లాడిన ఆయన స్నేహితుడు రామశివారెడ్డిని మీడియా ముందుకు తీసుకొస్తామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీతారామాంజనేయులుతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్వయంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారని, బహుశా ఆ చనువుతోనే తన దృష్టికి వచ్చిన ఆడియో టేపును శ్రీధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండవచ్చన్నారు.

బెదిరించి బ్లాక్ల్ మెయిల్ చేసే ఆలోచనతో ఆడియో టేపును ఇంటెలిజెన్స్ చీఫ్ కోటంరెడ్డికి పంపలేదన్నారు. నిన్నటి నుంచి తనకు 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఫోన్ చేశారని.. వారు కూడా వారి వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారంటూ శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాలినేని ఖండించారు .

పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధ‌మైన ఈ వ్యక్తికి 35 మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఎలా మాట్లాడుతారని, ఇలాంటి అసత్యాలు ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని తాను నిరూపించేందుకు సిద్ధమని, అలా నిరూపిస్తే శ్రీధర్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించలేని పక్షంలో తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైనది కాదన్నారు. శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేదా? అన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని .. కాకపోతే శ్రీధర్ రెడ్డి ఇలా వ్యవహరించడం మాత్రం సరైన పద్ధతి కాదన్నారు.

Tags:    
Advertisement

Similar News