రేణిగుంటలో ఘోరం.. వైద్యుడి కుటుంబం సజీవ దహనం..

భార్య, భర్తలిద్దరూ సొంత ఆస్పత్రి నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారి కుటుంబం అగ్ని కీలలకు బలైంది.

Advertisement
Update:2022-09-25 09:51 IST

తిరుపతి జిల్లా రేణిగుంటలో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం అది. కింద ఆస్పత్రి, పైన వైద్యుడి కుటుంబం నివాసం ఉండేలా నిర్మించుకున్నారు. తెల్లవారు ఝామున జరిగిన అగ్నిప్రమాదంలో వైద్యుడి కుటుంబం సజీవ దహనం అయింది. మంటల్లో చిక్కుకుని డాక్టర్ రవిశంకర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన ఇద్దరు పిల్లలు భరత్, కార్తీక కూడా చనిపోయారు. రవిశంకర్ రెడ్డి భార్య డాక్టర్ అనంతలక్ష్మి, తల్లి రామసుబ్బమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.

తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న రవిశంకర్ రెడ్డి రేణిగుంటలో సొంతగా ఆస్పత్రి ప్రారంభించాలనుకున్నారు. కార్తికేయ హాస్పిటల్ అనే పేరుతో కొత్త భవనం నిర్మించుకున్నారు. మరికొన్నిరోజుల్లో ఆ ఆస్పత్రి ప్రారంభించాల్సి ఉంది. ఈలోగా కొత్త భవనంలోకి కుటుంబం షిఫ్ట్ అయింది. భార్య, భర్తలిద్దరూ సొంత ఆస్పత్రి నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇటీవలే పాప పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ రవిశంకర్ రెడ్డి. అంతలోనే వారి కుటుంబం అగ్నికి ఆహుతైంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారు ఝామున డాక్టర్ ఇంట్లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఆస్పత్రి కోసం తెచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఫర్నిచర్ కూడా అక్కడే నిల్వ చేశారు. దీంతో మంటలు పెద్దఎత్తున రేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు వ్యాపించడంతో ఎవరూ తప్పించుకోలేకపోయారు. రవిశంకర్ రెడ్డి మంటల్లో మాడి మసైపోయారు. మిగతావారిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకు రాగలిగారు కానీ, పిల్లలిద్దరూ ఊపిరాడక అప్పటికే మృతిచెందారు. ఆస్పత్రి ప్రారంభం అయి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News