పవన్ దెబ్బతిన్న పులిలా వస్తున్నాడు.. పరుచూరి గోపాలకృష్ణ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు

పవన్ గత ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లు ఏమిటో అర్థమై ఉంటుందని, ఈసారి అలా జరగకుండా ముందుకు వెళ్లాలని సూచించారు.

Advertisement
Update:2023-08-09 18:10 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల్లో దెబ్బతిన్న పులిలా దూసుకువస్తున్నారని ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే కొనసాగి ఉండి ఉంటే మరో పదేళ్లకు ఎన్టీఆర్, చిరంజీవి రేంజ్‌కు వెళ్లి ఉండేవారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరిట తరచూ సినిమాలకు సంబంధించిన విశ్లేషణలు చేస్తుంటారు. తాజాగా ఆయన తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా గురించి విశ్లేషిస్తూ పవన్ గురించి, రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమాజం మారాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరి చేతుల్లోనే ఎప్పుడూ అధికారం ఉండకూడదన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు దెబ్బతిన్న పులిలా మళ్లీ ముందుకు వస్తున్నాడని పరుచూరి అన్నారు.

పవన్ గత ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లు ఏమిటో అర్థమై ఉంటుందని, ఈసారి అలా జరగకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. సమాజం గురించి రాజకీయ నాయకుడు చెబితే వినే వారి కంటే.. సినిమా నటుడు చెబితే వినేవాళ్లు ఎక్కువమంది ఉంటారని పరుచూరి అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని వ్యాఖ్యానించారు. పవన్ సినిమాలు చేయడం ఆపేయవద్దని, ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. రాజకీయాల్లో బిజీగా ఉంటే కనీసం ఎన్టీఆర్ లాగా అప్పుడప్పుడు సినిమాల్లో నటించాలని సూచించారు. పవన్ కోరుకున్నది ఆయనకు దక్కాలని ఈ సందర్భంగా పరుచూరి ఆకాంక్షించారు. కాగా, పవన్ కళ్యాణ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News