మాజీ మంత్రి కటౌట్‌కు 15 మంది పోలీసులతో భద్రత

నిజానికి నెల్లూరు నగరంలో కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు నిషేధం ఉంది. అయినా నిబంధనలు ఉల్లంఘించి నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2023-03-27 17:47 IST

నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ కటౌట్ కు ఒక సీఐ సహా 15 మంది పోలీసులు కాపలా కాయడం సంచలనం సృష్టిస్తోంది. కటౌట్ కు భద్రత కల్పించడం కోసం దాని ఎదురుగా 15 మంది పోలీసులు నిల్చొని ఉండటం స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇటీవల మాజీ మంత్రి అనిల్ కుమార్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలోని నర్తకి సెంటర్ లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

తమ ప్రియతమ నేతకు అనుచరులు కటౌట్ ఏర్పాటు చేయడం వరకు ఓకే కానీ, వారు ఆ కటౌట్ ను ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా అడ్డుగా పెట్టారు. ఈ చర్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు భారీ అనుచరగణంతో నర్తకి సెంటర్ వద్దకు వచ్చాడు. అయితే ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించే సమయంలో అనిల్ కుమార్ కటౌట్ ను తొలగిస్తారన్న అనుమానంతో ఒక సీఐ సహా 15 మంది పోలీసులు అనిల్ కుమార్ కటౌట్ వద్ద గంటల తరబడి కాపలా కాశారు.

అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు పోలీసులు భద్రత కల్పించడం వరకు ఓకే కానీ.. ఇలా కటౌట్ కు కూడా 15 మంది పోలీసులతో భద్రత కల్పించడం అవసరమా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణ జనం తన్నుకు చస్తున్నా పట్టించుకోరు కానీ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం ఇంత చొరవ చూపాలా..? అని మండిపడుతున్నారు.

నిజానికి నెల్లూరు నగరంలో కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు నిషేధం ఉంది. అయినా నిబంధనలు ఉల్లంఘించి నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించకపోగా మళ్లీ ఆ కటౌట్ల వద్దే పోలీసులు కాపలా నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News