రేవంత్‌కూ సహకారం.. జగన్‌కే వ్యతిరేకం..

తెలంగాణలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం రైతు బంధు నిధుల విడుదలకూ టీఎస్ సర్కారు జీవో ఇచ్చింది.

Advertisement
Update:2024-05-07 11:46 IST

ఎన్నికల సంఘం వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ఏపీకి ఒకలా తెలంగాణలో మరోలా ఈసీ వైఖరి ఉండడంతో వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ చేసిన‌ ఫిర్యాదులతో అధికారులను వరుసపెట్టి ఈసీ బదిలీ చేస్తోంది. కేవలం కూటమికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే డీజీపీని బదిలీ చేశారని.. అదే దారిలో సీఎస్‌ను బదిలీ చేయించేందుకు కూడా టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు.

పథకాలకు ఈసీ బ్రేక్ వేసిన తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలకు నిధులు విడుదల చేయవద్దని ఈసీ ఆదేశించింది. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. చివరకు పంట నష్టం అంచనా చేపట్టేందుకు అనుమతి ఇవ్వలేదు.

అదే ఎన్నికల సంఘం తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా లైన్ తీసుకుంది. గత నెల 23న తెలంగాణలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం రైతు బంధు నిధుల విడుదలకూ టీఎస్ సర్కారు జీవో ఇచ్చింది. వాటికి మాత్రం ఈసీ అభ్యంతరం తెలపలేదు.

తెలంగాణలో ఇన్‌పుట్ సబ్సిడీకి అంగీకరించడం, ఏపీలో మాత్రం ఇన్‌పుట్‌ సబ్సిడీకి నిధులు విడుదల చేయవద్దని ఆదేశించడంతో ఈసీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటోందన్న ఆరోపణలకు ఊతమిస్తోంది.

Tags:    
Advertisement

Similar News