జగన్ వేసిన రోడ్లపై లోకేష్ యాత్ర..
జగన్ శాంక్షన్ చేసిన రోడ్డుపై నడుస్తూ, ఆయన వేసిన శిలా ఫలకాన్ని కొట్టించే ప్రయత్నం చేశారంటూ నారా లోకేష్ పై ధ్వజమెత్తారు నారాయణ స్వామి.
అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు, అధికారంలో ఉన్నప్పుడు చేసే సంక్షేమం, అభివృద్ధి పనులు.. ప్రజల పన్నులతో చేసేవే కానీ, నాయకుల సొంత డబ్బుతో చేసేవి కావు. అయితే నాయకులు మాత్రం ఆయా పనులకు పాత్రధారులు, సూత్రధారులు తామేనంటూ వాటికి పేర్లు పెట్టుకుంటారు, శిలా ఫలకాలు వేసుకుంటారు. ఈ క్రమంలో ఏపీలో రోడ్ల విషయం మరోసారి చర్చకు వచ్చింది. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో తాము వేసిన రోడ్లపై జగన్ నడిచారంటూ లోకేష్ అన్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా వైసీపీ కూడా అదే పల్లవి అందుకుంది. జగన్ వేసిన రోడ్లపై లోకేష్ నడిచారంటూ కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
జగన్ శాంక్షన్ చేసిన రోడ్డుపై నడుస్తూ, ఆయన వేసిన శిలా ఫలకాన్ని కొట్టించే ప్రయత్నం చేశారంటూ నారా లోకేష్ పై ధ్వజమెత్తారు నారాయణ స్వామి. వనదుర్గాపురం, డిఎన్.కండ్రిగలో ఫారెస్ట్ క్లియరన్స్ ఇచ్చి జగన్ రోడ్డు వేయించారని, దానిపైనే ఇప్పుడు లోకేష్ నడుస్తున్నారని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికీ సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు.
అంబేద్కర్ కు పూలమాల వేయలేరా..?
దళిత వర్గాలను అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కు పూల వేసేందుకు లోకేష్ ఇష్ట పడలేదని ఆరోపించారు నారాయణ స్వామి. నారా లోకేష్ తో తిరిగే దళితులందరికి నవరత్నాల సంక్షేమ పథకాలు అందాయని, ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒకే కులం వెంట పరుగెడుతోందని విమర్శించారు. ఆ సామాజిక వర్గానికి చెందినవారిని బెంగళూరు నుంచి తరలిస్తున్నారని, యువగళం పేరుతో గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎడారిలా ఉన్న గంగాధార నెల్లూరు నియోజకవర్గాన్ని జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి చేశారన్నారు నారాయణ స్వామి. దళిత రిజర్వ్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ టీడీపీ ఇన్ చార్జ్ ను పెట్ట లేదని, అలాంటి యోగ్యత టీడీపీ వారిదని విమర్శించారు. దళితులకు జగన్ రాజకీయ భిక్ష పెట్టారని, చంద్రబాబు దళితులకు ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు కూడా వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెన్ను పోటు దారులంతా ఒక్కటైనా జగన్ ను ఏమీ చేయలేరన్నారు.