చిరంజీవి చుట్టూ కాపు ఓట్ల రాజకీయం.. తెరపైకి ప్రజారాజ్యం..

కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి నుంచి పోటీ చేసేందుకు కూడా పవన్ సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ దశలో అనూహ్యంగా ప్రజారాజ్యం పేరు తెరపైకి వచ్చింది.

Advertisement
Update:2022-08-24 08:57 IST

2008లో పుట్టి 2011లో కాంగ్రెస్ లో విలీనం అయింది ప్రజారాజ్యం పార్టీ. ఆ కథ ముగిసి దాదాపు దశాబ్దం దాటిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏపీ రాజకీయాల్లో ప్రజారాజ్యం ప్రస్తావన ప్రముఖంగా వస్తోంది. చిరంజీవి కూడా దాదాపుగా మరచిపోయిన ప్రజారాజ్యాన్ని ఇప్పుడు ప్రజలకు ఎందుకు గుర్తు చేస్తున్నారు. అప్పటి సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు నెమరు వేస్తున్నారు. అసలేంటి కథ..?

ఏపీలో రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్నా కూడా తెలగ, బలిజ, ఒంటరి.. ఇలా విడిపోయి ఉన్నారు కాపులు. వీరందర్నీ ఏకం చేసే ప్రయత్నం అప్పట్లో ప్రజారాజ్యం చేసినా ఫలితం లేదు, ఇప్పుడు జనసేన అదే పాలసీ ఎంచుకుంది. జనసేనాని పవన్ కల్యాణ్ కాపు ఓట్లను ఒకేచోటకు చేర్చాలనుకుంటున్నారు. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి నుంచి పోటీ చేసేందుకు కూడా పవన్ సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ దశలో అనూహ్యంగా ప్రజారాజ్యం పేరు తెరపైకి వచ్చింది.

చిరంజీవి కేంద్రంగా..

ఇటీవల‌ పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో చిరంజీవి, ప్రజారాజ్యం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వైసీపీని టార్గెట్ చేస్తూ, చిరంజీవిని హైలెట్ చేస్తూ, చిరుపై సింపతీ పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలోని కొందరు నేతలు గతంలో చిరంజీవిపై ఒత్తిడి పెంచి ప్రజారాజ్యాన్ని నాశనం చేశారని, పార్టీ లేకుండా పోవడానికి కారణం వారేనంటూ విరుచుకుపడుతున్నారు పవన్ కల్యాణ్. మరో అడుగు ముందుకేసి, అసలు చిరంజీవికి సీఎం జగన్ మర్యాద ఇవ్వడంలేదని, ఆయన ఇంటికి వెళ్లాలంటే కిలోమీటర్ ముందే కారు ఆపి నడిచి వెళ్లాలని, ఇదెక్కడి సంప్రదాయం అంటూ నిలదీస్తున్నారు. అంటే చిరంజీవి అభిమానుల్ని రెచ్చగొట్టి, వైసీపీపై ద్వేషం పెంచుకునేలా ఓ స్ట్రాటజీ ప్రకారమే పవన్ కామెంట్లు చేస్తున్నారని జగన్ టీమ్ ఆరోపిస్తోంది.

వైసీపీ ఎదురుదాడి..

వైసీపీ నేతలు ఎదురుదాడి ముమ్మరం చేశారు. అప్పట్లో వైఎస్ఆర్, ఇప్పుడు జగన్.. చిరంజీవికి ఎంతగానో గౌరవం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వదులుతున్నారు. వైఎస్ కుటుంబం చిరంజీవి మర్యాదకు ఎప్పుడూ భంగం కలిగించలేదని అంటున్నారు వైసీపీ మంత్రులు. ఆమాటకొస్తే, పవన్ కల్యాణ్ వల్లే ప్రజారాజ్యానికి నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇన్నాళ్లూ అన్నయ్యని పట్టించుకోని పవన్, ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ప్రజారాజ్యం పేరెత్తడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాపు ఓట్ల రాజకీయం ఇప్పుడు జనసేన, వైసీపీ మధ్య చిచ్చు పెట్టింది. అది కాపు సేన కాదు, కమ్మసేన అంటారు వైసీపీ నేతలు. మా చిరంజీవిని మీ వైసీపీ నేతలు అవమానించారని అంటున్నారు జనసైనికులు. గతంలో కూడా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలినా, విమర్శల దాడి జరిగినా.. ఈసారి సబ్జెక్ట్ ప్రజారాజ్యం, చిరంజీవి కావడం మాత్రం కొత్తగా ఉంది.

Tags:    
Advertisement

Similar News