పురందేశ్వరి మంత్రి పదవికి బాబు మోకాలడ్డు?

ఏపీ నుంచి అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేంద్రమంత్రి పదవి ఖాయమైంది. దాదాపు 30 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారు శ్రీనివాస వర్మ. ఈ నిర్ణయం పార్టీ విధేయతకు పట్టం కట్టినట్లు స్పష్టమవుతోంది.

Advertisement
Update:2024-06-09 19:13 IST

కేంద్ర కేబినెట్‌ కూర్పు దాదాపు ఫైనల్ అయింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఐదుగురికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. కానీ, ఏపీ విషయంలో మాత్రం కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ స్టేట్ చీఫ్‌ పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్నారంత. కానీ చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది.

2004 -2014 మధ్య యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా కేంద్రంలో కీ రోల్ పోషించాలని ఆశలు పెట్టుకున్నారు పురందేశ్వరి. ఇందులో భాగంగానే రాజమండ్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కానీ, చివరికి ఆమెకు నిరాశే మిగిలింది.

ఏపీ నుంచి అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేంద్రమంత్రి పదవి ఖాయమైంది. దాదాపు 30 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారు శ్రీనివాస వర్మ. ఈ నిర్ణయం పార్టీ విధేయతకు పట్టం కట్టినట్లు స్పష్టమవుతోంది. పురందేశ్వరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో ఏపీలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర కేబినెట్‌లో ప్లేసు ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే అదే సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరికి కేంద్రమంత్రి పదవి వద్దని బీజేపీ పెద్దలకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. దీంతో పురందేశ్వరి విషయంలో హైకమాండ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి పురందేశ్వరి పేరు పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరీ ప్రస్తుతం స్టేట్‌ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటారా.. రాష్ట్రానికే పరిమితం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News