జగన్ వ్యాఖ్యల్ని సాక్ష్యంగా పరిగణించాలి -దేవినేని ఉమా
పిన్నెల్లి కేసులో జగన్ వ్యాఖ్యల్ని కోర్టు సాక్ష్యంగా పరిగణించాలని అంటున్నారు టీడీపీ నేతలు. ఆ ఘటనను సమర్థించిన జగన్ పై కూడా కేసు నమోదు చేయాలంటున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం ధ్వంసం ఘటనపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. అది ఫేక్ వీడియో అని, ఉద్దేశపూర్వకంగానే మొదటగా నారా లోకేష్ దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారనేది వైసీపీ నేతల వాదన. ఇప్పటి వరకు వారు ఇదే వాదన వినిపిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా జగన్ మరో వాదన తెరపైకి తెచ్చారు. కోపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంటే ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టారని జగన్ ఒప్పుకున్నారని టీడీపీ లాజిక్ తీస్తోంది. పిన్నెల్లి కేసులో జగన్ వ్యాఖ్యల్ని కోర్టు సాక్ష్యంగా పరిగణించాలని అంటున్నారు టీడీపీ నేతలు. ఆ ఘటనను సమర్థించిన జగన్ పై కూడా కేసు నమోదు చేయాలంటున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
ఈవీఎం పగలగొట్టడం నేరమే కాదన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారని, అది నేరం కాదు అన్నారంటే రాజ్యాంగ వ్యవస్థలను వారు ధిక్కరించినట్టేనని చెప్పారు దేవినేని ఉమా. ఆ ఘటనను సమర్థించిన జగన్ పై కూడా కేసు నమోదు చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు చంబల్ లోయ మాదిరిగా మారిపోయిందని అన్నారాయన. అరాచకాలు చేసినోళ్లు మంచోళ్ళా..? అని ప్రశ్నించారు. పిన్నెల్లి వల్ల కొన్ని కుటుంబాలు, గ్రామాలు వదిలి వెళ్లిపోయాయని చెప్పారు. అప్పట్లో అన్యాయం జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం జైలుకి వెళ్లి మరీ పిన్నెల్లిని సమర్థించారని విమర్శించారు దేవినేని ఉమా.
జగన్ టూర్ ఫలితం ఏంటి..?
నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్, చంద్రబాబుకి మాస్ వార్నింగ్ ఇచ్చారని, వింటేజ్ జగన్ మళ్లీ కనిపించారని, ఇక సీఎం చంద్రబాబు పనైపోయిందని, ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైసీపీ అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా జగన్ కి బాగానే ఎలివేషన్లు ఇస్తున్నారు. టీడీపీ మాత్రం జగన్ పర్యటనపై విమర్శలు చేస్తోంది. తప్పు చేసిన వ్యక్తిని జైలుకి వెళ్లి కలవడమే కాకుండా, ఆయన్ను సమర్థిస్తూ మాట్లాడటం, మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం జగన్ కే చెల్లిందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. మొత్తమ్మీద జగన్ నెల్లూరు పర్యటన మాత్రం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.