ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు అద్భుతం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోందని అంబటి రాయుడు కితాబిచ్చారు.

Advertisement
Update:2023-11-18 19:39 IST

కార్పొరేటు స్కూళ్ల కన్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. టీమిండియాకు కొన్నేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో కూడా కొద్ది నెలల కిందట భేటీ అయ్యారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఇవాళ ఆయన తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నన్ని సదుపాయాలు దేశంలో మరెక్కడా లేవని ప్రశంసించారు. మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలకు రుచికరమైన ఆహారం ఇస్తున్నారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని, వైద్య ఆరోగ్య రంగంలో ఏపీకి సరితూగగల రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' గొప్ప కార్యక్రమమని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోందని అంబటి రాయుడు కితాబిచ్చారు.

Tags:    
Advertisement

Similar News