మోదీ హఠావో.. దేశ్ బచావో.. వైసీపీకి ఏడాదే ఆయుష్షు

మోదీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో దేశవ్యాప్తంగా సీపీఐ తరపున పాదయాత్రలు మొదలవుతాయని చెప్పారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. మోదీ ఇంకా ప్రధానిగా ఉంటే దేశం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు.

Advertisement
Update:2023-03-07 16:57 IST

దేశవ్యాప్తంగా యాత్రల కాలం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న రాష్ట్రాలతోపాటు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులంతా యాత్రలు చేపట్టారు. సీపీఐ కూడా త్వరలో పాదయాత్ర మొదలు పెడుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ. మోదీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో దేశవ్యాప్తంగా సీపీఐ తరపున పాదయాత్రలు మొదలవుతాయని చెప్పారు. మోదీ ఇంకా ప్రధానిగా ఉంటే దేశం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. అందుకే మోదీ దిగిపోవాలని, ఆయన్ను దింపేయాలని అన్నారు. విశాఖ సీల్ట్ ప్లాంట్ ను బీజేపీ డంపింగ్ యార్డ్ గా మార్చబోతోందని మండిపడ్డారు నారాయణ.

వైసీపీకి ఏడాదే ఆయుష్షు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఆయుష్షు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉందని అన్నారు నారాయణ. జనం మద్దతు నిజంగానే ఉంటే జగన్ ఎందుకు పోలీసుల వలయంలో తిరుగుతున్నాడని ప్రశ్నించారు. జనంలోకి రావాలంటే జగన్ కి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛ గా తిరగలేని జగన్, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసరడం హాస్యాస్పదం అని అన్నారు.

మోదీ, జగన్ ది నియంతృత్వ పాలన అని మండిపడ్డారు నారాయణ. వారి వల్లే రాష్ట్రం నాశనం అవుతోందని విమర్శించారు. ఏపీలో ఏ పార్టీ ఎలా పోటీ చేయాలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే హాస్యాస్పదంగా ఉందన్నారు నారాయణ. అవన్నీ కాకి లెక్కలని ఎద్దేవా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేసి, ఇప్పుడు పెట్టుబడులు కావాలంటే ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు అన్నప్పుడే పారిశ్రానిక వేత్తలకు నమ్మకం పోయిందన్నారు నారాయణ.

Tags:    
Advertisement

Similar News