రాజకీయాలకు అలీ గుడ్‌బై.. నెక్ట్స్‌ ఏంటంటే?

తనకు భగవంతుడు ఎంతో ఇచ్చాడని, రాజకీయం తోడైతే పది మందికి సేవ చేయొచ్చనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Advertisement
Update: 2024-06-28 17:25 GMT

సినీ నటుడు అలీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇకపై సామాన్య పౌరుడిగానే ఉంటానంటూ స్పష్టం చేశారు. తనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఛాన్స్‌ ఇచ్చిన రామానాయుడు 1999లో బాపట్ల ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు అలీ. 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇటీవల వైసీపీలో చేరానన్నారు. తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని, ఆరు భాషల్లో 1200కుపైగా సినిమాల్లో నటించానని చెప్పారు. తనకు భగవంతుడు ఎంతో ఇచ్చాడని, రాజకీయం తోడైతే పది మందికి సేవ చేయొచ్చనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.


తన తండ్రి పేరిట ట్రస్టు పెట్టి 16 ఏళ్లుగా సేవ చేస్తున్నానని చెప్పారు అలీ. తాను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ వ్యక్తులను పొగిడానని, కానీ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. ఇప్పుడు తాను ఏ పార్టీలోనూ లేనన్నారు. ఏ పార్టీ సపోర్టర్‌ను కూడా కాదన్నారు. ఇకపై సినిమాలు, షూటింగ్స్ చేసుకుంటానని స్పష్టం చేశారు. అందరిలాగే కామన్‌ మ్యాన్‌ లాగా ఐదేళ్లకు ఓసారి ఓటు వేసి వస్తానని చెప్పారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అలీకి రాజ్యసభ పోస్టు ఇస్తారని, ఎమ్మెల్సీ పోస్టు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు ఆ పదవులేవి రాలేదు. 2022లో అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగారు అలీ. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు అలీ. కానీ, ఆ కాంక్ష‌ నెలవేరలేదు. టికెట్‌ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. తాజాగా ఏపీలో వైసీపీ ఓడిపోవడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు అలీ.

Tags:    
Advertisement

Similar News