నేను బటన్ నొక్కితే, ఆ సొమ్ముకూడా కుట్రతో ఆపేశారు
పెన్షన్లు రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీరంతా అని అన్నారు జగన్. తాను బటన్ నొక్కితే ఆ సొమ్ము కూడా రాకుండా అడ్డుకుంటున్నారని, చివరికి తాను లబ్ధిదారులకోసం కోర్టుకి వెళ్లానని అన్నారు.
తాను ఏం చేసినా ఎన్నికలకోసం చేయలేదని, ఎన్నికలొస్తున్నాయని రెండు మూడు నెలల ముందుగా ఏ పథకం ప్రారంభించలేదని, ఏది చేసినా ప్రభుత్వంలోకి వచ్చినప్పటినుంచే మొదలు పెట్టానని గుర్తు చేశారు సీఎం జగన్. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అలా చేస్తున్నా కూడా ఎన్నికల కోడ్ అనే పేరుతో లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు జగన్.
57 నెలలుగా ఇంటింటికీ వచ్చిన పెన్షన్ కోసం ఇప్పుడు అవ్వాతాతలు ఇబ్బంది పడేలా చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు జగన్. పెన్షన్లు రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీరంతా అని అన్నారు. తాను బటన్ నొక్కితే ఆ సొమ్ము కూడా రాకుండా అడ్డుకుంటున్నారని, చివరికి తాను లబ్ధిదారులకోసం కోర్టుకి వెళ్లానని అన్నారు. పేద ప్రజలకు మంచి జరుగుతుంటే వారికి కడుపు మంట ఎందుకన్నారు. 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పిసికేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు జగన్.
మంగళగిరిలో జరిగిన ఎన్నికల మీటింగ్ లో సీఎం జగన్ ప్రసంగించారు. మంగళగిరి సీటు బీసీల సీటు అని, గతంలో ఈ సీటు ఆర్కేకి ఇచ్చినా, ఆయన్ని ఒప్పించి, ఆయనతో త్యాగం చేయించి తిరిగి బీసీలకు వచ్చేలా చేశానని చెప్పారు జగన్. మంగళగిరిలో బీసీ ఆడ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరి వల్ల మంచి కొనసాగుతుంది అనేది గుర్తించాలని ప్రజలకు సూచించారు.
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని చెప్పిన జగన్, తన హయాంలో అమలైన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే, మళ్లీ ఇంటింటికీ వాలంటీర్లు రావాలంటే వైసీపీ ప్రభుత్వమే రావాలని చెప్పారు. ఎన్నికల వేళ చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తుంటారని, అమలు కాని హామీలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తుంటారని, ఆయన మాయలో పడొద్దని చెప్పారు జగన్.