ఒకరు వెన్నుపోటు వీరుడు మరొకరు ప్యాకేజీ శూరుడు..

చక్రాల్లేని సైకిల్ ఎక్కలేని వ్యక్తి ఒకరని, తైలం పోస్తే కానీ గ్లాసు నిండని వ్యక్తి మరొకరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, పవన్ ప్యాకేజీ శూరుడు అంటూ దెప్పిపొడిచారు సీఎం జగన్.

Advertisement
Update:2023-07-04 14:38 IST

చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్ మరోసారి ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చక్రాల్లేని సైకిల్ ఎక్కలేని వ్యక్తి ఒకరని, తైలం పోస్తే కానీ గ్లాసు నిండని వ్యక్తి మరొకరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, పవన్ ప్యాకేజీ శూరుడు అంటూ దెప్పిపొడిచారు. 2014 నుంచి 2019 మధ్య ఆ ఇద్దరూ రాష్ట్రాన్ని ఏలారని, ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారన్నారు.

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏపీలో ఉండరని, వారికోసం ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాల్సిందేనన్నారు సీఎం జగన్. వారికి సామాజిక న్యాయం కంటే,‌ సామాజిక అన్యాయం‌ బాగా తెలుసన్నారు. పేదలకు మంచి చేసేందుకు ఇంగ్లిష్ మీడియం తెస్తే అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, ఆఖరికి నిరుపేదల ఇళ్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి దుర్మార్గులతో యుద్దం చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీపై విష ప్రచారం మరింత ఎక్కువ అవుతుందని, మంచిని మాత్రం కొలమానంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.


Full View

రోజుకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయిలో ఉన్న చిత్తూరు డైరీని హెరిటేజ్ కోసం మూసివేయించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు సీఎం జగన్. ఓ పద్ధతి ప్రకారం చిత్తూరు డైరీని నష్టాల్లోకి తెచ్చి, బకాయిలు చెల్లించలేని స్థితికి చేర్చి మూసివేయించారన్నారు. తానిచ్చిన మాట ప్రకారం డైరీకి ఉన్న 182 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం తీర్చిందన్ననారు. అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. రోజుకి 10లక్షల లీటర్ల పాలు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీని చేర్చుతామన్నారు జగన్. 5వేలమందికి ఉద్యోగాలు వస్తాయని, లక్షలమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని పాడిరైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. రైతులను మోసం చేసేందుకు అలవాటు పడిన డైరీలకు అమూల్ రావడంతో జ్వరం మొదలైందన్నారు జగన్.

Tags:    
Advertisement

Similar News