అలాంటివారిని చంద్రబాబు అంటారు.. సీఎం జగన్ సెటైర్లు
దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటామని చెప్పారు జగన్. మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కొని, ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుని సమర్థిస్తున్నవారు కూడా దుష్టచతుష్టయమేనని వివరించారు.
తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే అలాంటి వారిని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, సభలో చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు.
మోసగాడికి మళ్లీ అధికారమిస్తారా..?
ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి చంద్రబాబు మోసం చేస్తుంటారని, అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలని ప్రజల్ని ప్రశ్నించారు సీఎం జగన్. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం దక్కకూడదని పిలుపునిచ్చారు.
దుష్టచతుష్టయం అంటే..
పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారని, పరాయి స్త్రీ పై కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారని, అలాంటి రావణుడిని సమర్థించిన వాళ్లను రాక్షసులు అంటారని చెప్పారు సీఎం జగన్. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటామని చెప్పారు. మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కొని, ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుని సమర్థిస్తున్నవారు కూడా దుష్టచతుష్టయమేనని వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్ కల్యాణ్ ఈ యుగంలో దుష్టచతుష్టయంగా మారారని మండిపడ్డారు.
మేలు జరిగితేనే ఓటు వేయండి..
రాజకీయమంటే జవాబుదారీతనం అని చెప్పారు సీఎం జగన్. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారని అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని తాను నమ్ముకోలేదని, కేవలం దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. "మీ ఇంటిలో మంచి జరిగిందా..? లేదా..?" ఇదే కొలమానంగా పెట్టుకుని ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుందని చెప్పారు జగన్. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే ఉంటాయని, సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఆ పరిస్థితులను మార్చాలనే ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు.