విశాఖలో అన్ని దిక్కులూ మనవే – జగన్

విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనుకుంటోంది వైసీపీ. అయితే నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుండటం నిజంగానే వైసీపీకి పంటికింద రాయిలా ఉంది.

Advertisement
Update:2022-11-16 08:15 IST

2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు వైసీపీ గెలిచినా నాలుగు దిక్కుల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు టీడీపీకే దక్కాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు, పడమర గణబాబు, దక్షిణం వాసుపల్లి గణేష్, ఉత్తరం గంటా శ్రీనివాస్.. టీడీపీ తరపున విజయం సాధించారు. ఇప్పటికే దక్షిణం దిక్కు వైసీపీ వశమైంది, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ అనుబంధ సభ్యుడిగా మారారు. 2024 ఎన్నికల్లో ఆయనకే వైసీపీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. మిగిలిన మూడు దిక్కుల సంగతేంటి..? వీటిలో పట్టు పెంచుకోవ‌డానికే సీఎం జగన్ కసరత్తులు మొదలు పెట్టారు. ముందు గంటా నియోజకవర్గం నుంచి పని ప్రారంభించాలనుకుంటున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో సమావేశం పెట్టారు.

నాలుగు దిక్కులూ మనవే..

విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనుకుంటోంది వైసీపీ. ఈ దశలో విశాఖపై రాజకీయ పట్టుకూడా ఆ పార్టీకి అవసరం. అయితే నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుండటం నిజంగానే వైసీపీకి పంటికింద రాయిలా ఉంది. అందుకే ఈసారి విశాఖ నాలుగు దిక్కులూ వైసీపీ ఖాతాలో పడిపోవాలంటున్నారు జగన్. 2024 ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో వైసీపీ గెలవాలంటున్న ఆయన, విశాఖలో అన్ని స్థానాలు మనకే రావాలంటూ కార్యకర్తలకు ఉపదేశమిచ్చారు.

30ఏళ్లు మనమే..

2024 ఎన్నికల్లో గెలిస్తే తర్వాత 30 ఏళ్లపాటు వైసీపీయే అధికారంలో ఉంటుందంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, దానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో హామీల్లో 98 శాతం పైన నెరవేర్చామని, ఇప్పుడు ప్రజలకు దగ్గరకు వెళ్లి వారి ఆశీస్సులు కోరుతున్నామని చెప్పారు జగన్. మన టార్గెట్ 175 అని వివరించారు. కుప్పంలాంటి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎనికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశామని, విశాఖ మన చేతికి అందదా అని ప్రశ్నించారు. విభేదాలుంటే పక్కనపెట్టి పనిచేయాలన్నారు జగన్. టీడీపీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన ఆయన.. కుప్పంతో నియోజకవర్గ సమీక్షలు స్టార్ట్ చేశారు. తాజాగా విశాఖ ఉత్తరం నియోజకవర్గం సమీక్ష పూర్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News