బాబుని భయపెట్టిన జగన్.. కుప్పం నుంచి జారుకోవాల్సిందేనా..?

ప్రతి ఇంటికీ జరిగిన మేలు వారికి తెలిసేలా గడప గడప కార్యక్రమంలో అవగాహన కల్పించాలన్నారు. చంద్రబాబు హయాంలో ఇన్నాళ్లూ ఏం జరిగింది, వైసీపీ హయాంలో ఏం జరిగింది అనే తేడా వారు గుర్తించేలా చేయాలని చెప్పారు.

Advertisement
Update:2022-08-05 07:43 IST

2024 ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించాలంటూ నమ్మకంగా చెబుతున్న సీఎం జగన్ కుప్పం నుంచే దండయాత్ర మొదలు పెట్టేలా ఉన్నారు. తొలి సమీక్ష కుప్పంతో మొదలు పెట్టిన జగన్.. దాదాపుగా చంద్రబాబుని భయపెట్టినంత పనిచేశారు. కుప్పంలో భరత్ ని గెలిపించుకుని వస్తే మంత్రిని చేస్తానని స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి 65కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కుప్పంకు కృష్ణా జలాలను తెస్తామని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు.

కుప్పం నా నియోజకవర్గమే..

కుప్పంను తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని చెప్పిన జగన్, కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు, నీడగా ఉంటానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు చేసిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని, ఇంటింటా మనం చేసిన మంచి కన్పిస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలు రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రావాలన్నారు. కుప్పంలో నాడు నేడు పనులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు.. అన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ జరిగిన మేలు వారికి తెలిసేలా గడప గడప కార్యక్రమంలో అవగాహన కల్పించాలన్నారు. చంద్రబాబు హయాంలో ఇన్నాళ్లూ ఏం జరిగింది, వైసీపీ హయాంలో ఏం జరిగింది అనే తేడా వారు గుర్తించేలా చేయాలని చెప్పారు.

టార్గెట్ బీసీ..

కుప్పం టీడీపీకి కంచుకోట అనుకోవటం పొరపాటని, అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని, వైసీపీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు మేలు జరిగిందని, అంటే.. కుప్పం ప్రజలు టీడీపీకంటే వైసీపీనే ఎక్కువగా నమ్మాల్సిన పరిస్థితి ఉందని వివరించారు సీఎం జగన్. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతారు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే భ్రమలో ఇప్పటి వరకూ అక్కడి ప్రజలు ఉన్నారని, ఆ భ్రమను కల్పించి చంద్రబాబు అక్కడినుంచి వరుసగా గెలుస్తూ వచ్చారని, ఇకపై అలాంటి సందర్భమే లేదు కాబట్టి కుప్పం ప్రజలు చంద్రబాబుకి ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పారు జగన్. కక్షసాధింపు రాజకీయాలు లేకుండా అందర్నీ కలుపుకొని వెళ్లాలని జగన్ పార్టీ నాయకులకు సూచించారు.

Tags:    
Advertisement

Similar News