టీడీపీపైకి జగన్ బీసీ అస్త్రం..?

ఏలూరు లోక్ సభకు టీడీపీ పోటీలో ఉంటే మాగంటి వెంకటేశ్వరరావు చౌదరి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మాగంటే ప్రకటించారు. ఇక వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీచేస్తారు.

Advertisement
Update:2024-02-19 11:20 IST

రాబోయే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డేమో అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవసరమైన చోట్ల అభ్యర్థులను మార్చటానికి వెనకడాటంలేదు. ఎంతటి సన్నిహితులైనా, ఎంత బలవంతులు అనే ప్రచారం ఉన్నా.. సరే మార్చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలను మార్చేసి వీలైనంతలో బీసీలకు టికెట్లు ఖాయంచేస్తున్నారు. బీసీల్లో కూడా జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపికచేస్తున్నారు. ఎలాగంటే.. గోదావరి జిల్లాల్లో బీసీల్లో బలమైన శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో బీసీల్లోనే మరో బలమైన సామాజికవర్గమైన యాదవులకు పెద్దపీట వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తారనే ప్రచారం జరుగుతున్న నేతల్లో అత్యధికులు కమ్మోరే అనటంలో సందేహంలేదు. దీనివల్ల ఏమైందంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ కమ్మ అభ్యర్థులు వర్సెస్ వైసీపీ బీసీ అభ్యర్థులు అన్న ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు కాలేదు. కాని కచ్చితంగా టీడీపీ పోటీచేస్తుందని ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులను చూస్తే ఈ విషయం అర్థ‌మైపోతుంది. నరసరావుపేట ఎంపీగా టీడీపీ తరపున లావు శ్రీ కృష్ణదేవరాయులు పోటీచేయటం ఖాయం. మరి వైసీపీ తరపున అనీల్ కుమార్ యాదవ్ పోటీచేయబోతున్నారు.

ఏలూరు లోక్ సభకు టీడీపీ పోటీలో ఉంటే మాగంటి వెంకటేశ్వరరావు చౌదరి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మాగంటే ప్రకటించారు. ఇక వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీచేస్తారు. రాజమండ్రి, నరసాపురం ఎంపీలుగా వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్, గూడూరి ఉమాబాల(శెట్టిబలిజలు)ను ఎంపికచేశారు. ఇక టీడీపీ కూటమి తరపున ఏ పార్టీ పోటీచేస్తుందో తెలీదు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్(శెట్టిబలిజ) పోటీచేయబోతున్నారు. రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా శెట్టిబలిజే.

అలాగే మైలవరంలో టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీలో ఉండటం దాదాపు ఖాయం. వైసీపీ తరపున తిరుమల యాదవ్, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు కమ్మ నేత అయితే వైసీపీ తరపున అరవింద యాదవ్ పోటీలో ఉంటారు. కనిగిరిలో ఉగ్రనరసింహారారెడ్డి పోటీచేస్తుంటే వైసీపీ తరపున నారాయణ యాదవ్, తణుకులో అరమిల్లి కమ్మ అభ్యర్థి అయితే వైసీపీలో కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ పోటీలో ఉంటారు. ఇవి కాకుండా మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టి చేనేత సామాజికవర్గం అభ్యర్థులను ఫైనల్ చేశారు. మొత్తంమీద టీడీపీ మీదకు జగన్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని అర్థ‌మైపోతోంది. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News