పవన్ ని వదిలేదే లేదు.. జగన్ మరింత ఘాటు వ్యాఖ్యలు
గతంలో దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్.. అంటూ పవన్ ని విమర్శించిన జగన్ కొత్తగా బాబు చంకలో పిల్లి అంటూ మరో ట్యాగ్ లైన్ ఇచ్చారు.
మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ ని కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నారు సీఎం జగన్. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం ప్రాంతంలో జరిగిన సభలో ఆయన్ను మరింత ఘాటుగా విమర్శించారు. కాకినాడ సభలో పవన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి మరీ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్యాకేజీ స్టార్ కి పెళ్లిళ్లే కాదు, నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయంటూ ఎద్దేవా చేశారు. మనకు ప్యాకేజీ స్టార్ లు, సినిమా స్టార్ లు వద్దని.. లోకల్ స్టార్ వంగా గీతను పిఠాపురంలో గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.
బాబు చంకలో పిల్లి..
గతంలో దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్.. అంటూ పవన్ ని విమర్శించిన జగన్ కొత్తగా బాబు చంకలో పిల్లి అంటూ మరో ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదని, బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడికి ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబే నిర్ణయిస్తారన్నారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అలా ఉంటుంది పవన్ వ్యవహారం అన్నారు జగన్.
పవన్ కల్యాణ్ పిఠాపురంలో ప్రజలకు అందుబాటులో ఉండరని, కేవలం ఎన్నికలకోసమే ఆయన ఇక్కడకు వస్తున్నారని విమర్శించారు జగన్. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోయారన్నారు. అలాంటి పవన్ పిఠాపురంలో ఎందుకు ఉంటారన్నారు. ఇక కూటమిపై కూడా చెణుకులు విసిరారు. బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, జనసేనదే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, బాబు పొడవమంటే పురంధేశ్వరి తన తండ్రికే వెన్నుపోటు పొడిచారన్నారు. పవన్ అయినా, పురంధేశ్వరి అయినా.. చంద్రబాబు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారని.. వాళ్లు ఉన్న పార్టీలకే వెన్నుపోటు పొడిచారని వివరించారు జగన్.