మారుతున్న ఏపీ ఉద్యోగుల మూడ్
37 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ఆ సంఘం చైర్మన్ బొప్పరాజు వెల్లడించారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలంతా సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై మొన్నటి వరకు కారాలుమిరియాలు నూరిన వారు కూడా ఇప్పుడు శాంతించారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు చాలా గట్టిగా పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన గ్యారెంటీ పెన్షన్ స్కీంపై ఉద్యోగుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దాంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, 16 శాతం హెచ్‌ఆర్‌ఏతోపాటు పలు డిమాండ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే ఉద్యమాన్ని విడతల వారీగా మొదలుపెట్టిన ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కూడా ఉద్యమాన్ని విరమించింది. 37 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ఆ సంఘం చైర్మన్ బొప్పరాజు వెల్లడించారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలంతా సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. గ్యారెంటీ పెన్షన్ స్కీంను సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం 32 శాతంతో గ్యారెంటీ పెన్షన్ స్కీం అమలు చేయాలనుకుందని.. ఈ ప్రభుత్వం 50 శాతంతో అమలు చేయడమే కాకుండా పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇస్తామని ప్రకటించిందని ఇది సాహసోపేతమైనదేనన్నారు. కొందరు తాము ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ విధానమే తమ ఉద్దేశమని ఆ విషయాన్ని సీఎంకు వివరించగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు చేయగలిగామని చెప్పారన్నారు.
మున్ముందు కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ విధానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని.. అలాగని ప్రభుత్వం ప్రస్తుతం అందించిన రాయితీలు, సాయానికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండటం సరికాదన్నారు. అయితే చాలా మంది ఉద్యోగుల్లోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రిత్యా ఓపీఎస్ సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ పట్ల చాలా మంది సానుకూలంగానే స్పందిస్తున్నారు.