ఈనాడు కథనాలకు చంద్రబాబు ట్వీట్లు
సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటుతుంటారని, కానీ సీఎం జగన్ వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో భారీ వృక్షాలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
పత్రికల్లో వార్తల ప్రమోషన్ కోసం.. పేపర్ కటింగ్ లు, వార్తల లింకుల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నట్టున్నారు. వరుసగా ఈనాడు కథనాలను పోస్ట్ చేస్తూ వాటిపై ట్వీట్లు పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా రోడ్డుపక్కన ఉన్న చెట్లు నరికేశారంటూ ఈనాడులో ఓ కథనం ఇచ్చారు. దీన్ని కోట్ చేస్తూ చంద్రబాబు, జగన్ పై మండిపడ్డారు.
రివర్స్ రెడ్డి..
"మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు, చెట్లు నరికెయ్యాలని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే. నువ్వు జగన్ రెడ్డి కాదు.. రివర్స్ రెడ్డి " అంటూ చంద్రబాబు ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటుతుంటారని, కానీ సీఎం వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో భారీ వృక్షాలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డం లేకపోయినా చెట్లను నరికివేసే సంస్కృతిని ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని అన్నారు చంద్రబాబు.
మేం తెచ్చాం.. మీరు తరిమేశారు..
ఇక అనంతపురంలో పేజ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకున్న రెండు పరిశ్రమలు తెలంగాణకు తరలిపోవడంపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. ఈనాడు కథనాన్ని ఉటంకిస్తూ ఆయన జగన్ పై దుమ్మెత్తిపోశారు. తాము పరిశ్రమల్ని తెస్తే, వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల్ని తరిమేస్తోందని విమర్శించారు. "పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా.. లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా?" అంటూ ట్వీట్ చేశారు.