పసలేని బాబు ప్రసంగం.. నిరాశ పరచిన ప్రజాగళం
మైనార్టీలను ప్రసన్నం చేసుకోడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు చంద్రబాబు. తాము ఎన్డీఏలో ఉన్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగలేదని చెప్పుకొచ్చారాయన.
ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఈ జిల్లానుంచి ప్రజాగళం మొదలు పెట్టానంటూ చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు.. మండుటెండలో కార్యకర్తల్ని పూర్తిగా నిరాశపరిచారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే ప్రయత్నం తాను మొదలు పెట్టానంటూ డప్పు కొట్టుకున్నారు. ఆ పని ఇప్పుడు ఆగిపోయిందని, తిరిగి తనకే అధికారం అప్పగించాలని కోరారు. టీడీపీ హయాంలో 90శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయితే, వైసీపీ వచ్చాక మిగిలిన 10శాతం కూడా పూర్తి చేయకుండా పోయారని అన్నారు. ప్రజాగళం ఏదో కొత్తగా ఉంటుందేమో అనుకుంటే మళ్లీ పాత పాటే పాడారు బాబు.
సిద్ధంపై వెటకారం..
సిద్ధం అంటూ జగన్ వస్తున్నారని, ఆయన్ను ఇంటికి పంపేందుకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు చంద్రబాబు. సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని మండిపడ్డారు. ఎక్కడ భూములు కనపడినా వైసీపీ నేతలు వదలట్లేదని, చివరకు ఇళ్లను కూడా కబ్జా చేస్తున్నారని అన్నారు. తాము కూటమి కట్టింది తమకోసం కాదని, వైసీపీని అధికారంలోనుంచి దించడం కోసమేనని అన్నారు చంద్రబాబు.
మైనార్టీలను ప్రసన్నం చేసుకోడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు చంద్రబాబు. తాము ఎన్డీఏలో ఉన్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగలేదని చెప్పుకొచ్చారాయన. రాష్ట్రం కోసం బీజేపీతో కలిస్తే విమర్శిస్తున్నన వైసీపీ నేతలు, ఐదేళ్లలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. మైనార్టీలకోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు చంద్రబాబు.
సూపర్ సిక్స్ పథకాలను మరోసారి ఏకరువు పెట్టిన చంద్రబాబు సూటిగా, స్పష్టంగా తాను మాత్రమే రాష్ట్రానికి ఎందుకు కావాలో వివరించలేకపోయారు. ఓవైపు జగన్ పథకాలను విమర్శిస్తూనే, తాను అధికారంలోకి వస్తే ఆయా పథకాలకు ఆర్థిక సాయం పెంచుతానని చెప్పడం విశేషం. మొత్తమ్మీద ప్రజాగళం అంటూ మరోసారి ప్రజల్లోకి వచ్చిన చంద్రబాబు కార్యకర్తల్ని పూర్తిగా నిరాశపరిచారు.