మాజీ సీఎంలకు, జగన్ కు తేడా చెప్పిన చంద్రబాబు
జగన్ కోసం అధికారులు బలిపశువులు కావొద్దని సూచించారు. జగన్ చెప్పినట్టల్లా చేస్తూ పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ చేరిక సభలో మరోసారి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. ఏపీకి గతంలో పని చేసిన ముఖ్యమంత్రుల్లో కొంతమంది అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉన్నారని... కానీ, జగన్ లాగా విధ్వంసం చేసిన వారు మాత్రం ఎవరూ లేరన్నారు. ఏ సీఎం అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు తపిస్తారే కానీ, జగన్ లా వ్యవస్థలపై దాడులు చేయరని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరూ సభలు, సమావేశాలు పెట్టకూడదని జీవో నంబర్ 1 తీసుకువచ్చారని, అనపర్తిలో తన సభకు అడ్డంకులు సృష్టించి రాక్షసానందం పొందారని చెప్పారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో ఉన్న తమపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని, ఆనాడు తాము తలచుకుంటే ఆయన పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు.
పోలీసులపై సింపతీ..
రాష్ట్రంలో ఐపీసీ చట్టం లేదని, దాని స్థానంలో వైసీపీ చట్టం ఉందన్నారు చంద్రబాబు. జగన్ కోసం అధికారులు బలిపశువులు కావొద్దని సూచించారు. జగన్ చెప్పినట్టల్లా చేస్తూ పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పేటీఎం బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలను చైతన్యం చేసే దిశగా తాను ముందుకెళ్తానన్నారు చంద్రబాబు. మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సంపద అంతా తన వద్దే ఉండాలనే ఆర్థిక ఉగ్రవాది జగన్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. అందరూ బానిస జీవితం గడపాలనేది ఆయన ఉద్దేశమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పేదలయ్యారని, జగన్ ధనవంతుడవుతూనే ఉన్నారన్నారు. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం విక్రయిస్తున్నారని చెప్పారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజలను దోచుకుంటున్నారన్నారు.
సీబీఐ చెప్పేసిందిగా..
వివేకా హత్య కేసులో అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని సీబీఐ అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొందని అన్నారు చంద్రబాబు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర పన్నినట్లు చార్జ్ షీట్ లో వెల్లడించారన్నారు. తప్పు చేసి ఇతరులపై నెట్టివేయాలని జగన్ చూశారని, కానీ దొరికిపోయారని, జగన్ నాటకాలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఈరోజు వారి ప్రాణాలకే రక్షణ లేకుండాపోయిందన్నారు చంద్రబాబు.