చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా?
టీడీపీ తరపున ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న వ్యూహకర్త రాబిన్ శర్మ చేయిస్తున్న సర్వేలో నగరాలు, పట్టణాల్లోని ఓటర్లలో వైసీపీ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఇంకా బలంగా ఉందని ఫీడ్ బ్యాక్ అందిందట.
తొందరలోనే చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. తాను పర్యటించటమే కాకుండా పార్టీలోని మహిళా నేతలను కూడా రంగంలోకి దింపాలని ప్లాన్ చేశారు. చంద్రబాబు గ్రామీణ ప్రాంతంపై ప్లాన్ చేయటానికి కారణాలు ఉన్నాయి. టీడీపీ తరపున ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న వ్యూహకర్త రాబిన్ శర్మ రాష్ట్రంలోని ఓటర్లను మూడు వర్గాలుగా విభజించారట. అవేమిటంటే నగర ఓటర్లు, పట్టణ ఓటర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్లు.
నగర ఓటర్లంటే కార్పొరేషన్లు, మేజర్ మున్సిపాలిటిలు కవర్ అవుతాయట. పట్టణ ఓటర్లంటే మున్సిపాలిటీలు కవర్ అవుతాయట. ఇక గ్రామీణ ఓటర్లంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోని నియోజకవర్గాలతో పాటు కొన్ని పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు కూడా వస్తాయట. ఎందుకిలా వర్గీకరించారంటే నగరాలు, పట్టణాల్లోని ఓటర్లలో వైసీపీ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందనే ఫీడ్ బ్యాక్ అందిందట. అయితే రాబిన్ శర్మ చేయిస్తున్న సర్వేల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఇంకా బలంగా ఉందని తేలిందట.
అందుకనే ఓటర్లను మూడు వర్గాలుగా విభజించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సుమారు 100 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి వీటిపై దృష్టిపెట్టిన చంద్రబాబు ఈమధ్యనే ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోతో ప్రచారంలో దూసుకుపోవాలని డిసైడ్ చేశారట. మహిళల కోసం ప్రకటించిన మహాశక్తి పథకంపై విస్తృత ప్రచారం చేయాలని మహిళా నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. తొందరలోనే మహిళా నేతల 50 రోజుల పర్యటన మొదలవ్వబోతోందని సమాచారం. రూటు మ్యాప్‌పై కసరత్తు జరుగుతోంది.
ఈమధ్యనే మొదలైన బస్సు యాత్ర వల్ల పెద్దగా ప్రభావం కనబడలేదని ఫీడ్ బ్యాక్ అందిదట. అందుకనే అచ్చంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలనే టార్గెట్ చేసేందుకు మహిళా నేతలనే రంగంలోకి దింపబోతున్నారు. ఈ 50 రోజుల పర్యటనలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకంలో రూ. 1500, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకు నెలకు రూ.15 వేలు హామీల గురించి పదేపదే ప్రచారం చేయటమే టార్గెట్‌గా పెట్టారు. మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఓటు బ్యాంక్‌పైన చంద్రబాబు దృష్టిపెట్టారు. మరి ఈ ప్లాన్ వర్కవుటవుతుందా? లేదా చూడాలి.