బయట ప్రెస్ మీట్లు ఎందుకు..? అసెంబ్లీకి రావొచ్చుగా

సంక్షేమ పథకాలకోసం బటన్ నొక్కి రూ.2.71 లక్షలు పంపిణీ చేస్తే, రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందని ప్రశ్నించారు చంద్రబాబు.

Advertisement
Update:2024-07-27 07:17 IST

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పిన చంద్రబాబు, సమావేశాలు పూర్తయిన వెంటనే ఏరోజుకారోజు ఇంటిలోనుంచే ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్ కు ఓ సలహా ఇచ్చారు. "బయట ప్రెస్ మీట్లు ఎందుకు, దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు" అంటూ సవాల్ విసిరారు. శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలేనంటూ జగన్ ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలను సీఎం చంద్రబాబు ఖండించారు. జగన్ చెప్పిన అప్పుల లెక్కలన్నీ తప్పులేనన్నారు.

వైసీపీ హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారని అధికారిక గణాంకాలతో తాము వెల్లడించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. కానీ జగన్ మాత్రం కేవలం రూ.7.48 లక్షల కోట్లు అప్పు చేశామంటూ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకోసం బటన్ నొక్కి రూ.2.71 లక్షలు పంపిణీ చేస్తే, రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందని ప్రశ్నించారు. ప్రజలు అప్పులపాలయ్యారని, వారి తలసరి ఆదాయం పెరగలేదని ఐదేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని విమర్శించారు చంద్రబాబు.

ఆ లెక్కలు ఎక్కడ..?

రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్‌.. ఆ లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు. ఆయనలో నిజాయతీ, ధైర్యం, సిగ్గు ఉంటే హత్యకు గురయినవారి పేర్లు వెల్లడించాలన్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలనలో జరిగిన రాజకీయ హత్యల్లో చనిపోయినవారి పేర్లు, చంపినవారి పేర్లు తాము వెల్లడించామని, జగన్‌కు దమ్ముంటే ఆ 36 హత్యల వివరాలు బయటపెట్టాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల కేసుల్ని తిరిగి తెరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News