ఇద్దరూ కావాలనే ‘రూటు’ మారుస్తున్నారా?

అప్పుడు చంద్రబాబు ఇప్పుడు పవన్ ఒకేలా వ్యవహరించారు. అంటే ఇద్దరూ కూడబలుక్కునే రూట్ మ్యాప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అర్థ‌మవుతోంది.

Advertisement
Update:2023-08-12 11:32 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కావాలనే రెచ్చగొట్టేందుకు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పెద్ద ప్లానే వేసుకున్నట్లున్నారు. అందుకనే కావాలనే ఇద్దరు రూట్లు మారుస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఉత్తరాంధ్రలో వారాహియాత్రను పవన్ గురువారం మొదలుపెట్టారు. వైజాగ్‌లోని జగదాంబ సెంటర్‌లో సభ తర్వాత పవన్ సడెన్‌గా రుషికొండకు బయలుదేరారు. నిజానికి పోలీసులకు ఇచ్చిన రూట్‌ మ్యాప్‌లో రుషికొండకు వెళ్ళటం లేదు. అయినా కావాలనే పవన్ రుషికొండకు బయలుదేరారు.

దాంతో పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద వాగ్వాదం జరిగింది. ఒకవైపు పవన్ కాన్వాయ్, మరోవైపు వేలాది మంది పవన్ అభిమానులు, ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ అవటంతో వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు దాంతో వాతావరణమంతా గందరగోళమైపోయింది. రుషికొండకు వెళతానని పవన్ ముందుగానే పోలీసులకు రూట్‌ మ్యాప్‌లో చెప్పుంటే ఏమి జరిగేదో తెలియ‌దు. కానీ రూట్ మ్యాప్‌లో ఏమి చెప్పకుండా పవన్ రుషికొండకు వెళ్ళాలని పట్టుబట్టడం అంతా వ్యూహాత్మకంగానే ఉంది. చివరకు పోలీసుల అభ్యంతరాలను కాదని, అభిమానులతో కలిసి రుషికొండకు వెళ్ళారు.

ప్రభుత్వాన్ని కావాలని గబ్బు పట్టించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ప్లాన్ వేసినట్లు అనుమానంగా ఉంది. పది రోజుల క్రితమే చంద్రబాబు ఇలాగే చేశారు. పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్ళాల్సిన చంద్రబాబు సడెన్‌గా పుంగనూరు పట్టణంలోకి ఎంటరయ్యారు. దాంతో అంగళ్ళు అనే ప్రాంతంలో టీడీపీ-పోలీసులు, వైసీపీ నేతలు, శ్రేణులకు ఎంత పెద్ద గొడవైందో అందరికీ తెలిసిందే. అక్కడ కూడా చివరి నిమిషంలో చంద్రబాబు రూట్ మ్యాప్‌కు విరుద్ధంగా వ్యవహరించారు.

రూట్ మ్యాప్‌కు విరుద్ధంగా వెళితే పోలీసులతో సమస్య వస్తుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా రూట్ మ్యాప్‌ను ఎందుకు మార్చారంటే గొడవలు కావాలనే రూట్‌ మార్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు పవన్ ఒకేలా వ్యవహరించారు. అంటే ఇద్దరూ కూడబలుక్కునే రూట్ మ్యాప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అర్థ‌మవుతోంది. పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి తాము ఇంకో రూట్‌లో ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు అసలు రూట్ మ్యాప్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో. కోర్టులో ఒక పిటీషన్ వేసి తాము పోలీసులకు రూట్ మ్యాప్‌ ఇవ్వకుండా అనుమతులు తెచ్చుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్యలుండవు. ఇప్పుడే ఇలాగుంటే ముందుముందు మరిన్ని సమస్యలు పెరగటం ఖాయమనే అనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News