రండి బాబూ రండి టికెట్లిస్తాం.. వైసీపీ నుంచి వ‌చ్చేవారికోసం బాబు ప‌డిగాపులు

న‌ర‌సాపురంలో వైసీపీ నుంచి గెలిచి త‌ర్వాత స్వ‌ప‌క్షంలోనే అస‌మ్మ‌తివాదిగా మారిన ర‌ఘురామ‌కృష్ణరాజుకు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్ ఇచ్చేసిన‌ట్లే.

Advertisement
Update:2024-02-01 13:30 IST

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌మ పార్టీ నేత‌లు ఎవ‌రిపైనా చంద్ర‌బాబుకు ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌ట్లేదు. ముఖ్యంగా లోక్‌స‌భ స్థానాల్లో అయితే అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది ఊహించుకోవ‌డానికి కూడా బాబు భ‌య‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 22 స్థానాల్లో బొక్క‌బోర్లాప‌డిన పార్టీకి ఈసారీ ప‌రిస్థితి పెద్దగా మెరుగుప‌డిందేమీ లేద‌ని ముందే గుర్తించిన‌ట్లు క‌నిపిస్తున్నారు. అందుకే అధికార వైసీపీ నుంచి ఎవ‌రైనా వ‌స్తే కండువా క‌ప్పేసి ఎంపీ టికెట్ ఇచ్చేద్దామ‌న్న‌ట్లుగా చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తున్నారు.

ఇప్ప‌టికే 3 చోట్ల టికెట్లు

న‌ర‌సాపురంలో వైసీపీ నుంచి గెలిచి త‌ర్వాత స్వ‌ప‌క్షంలోనే అస‌మ్మ‌తివాదిగా మారిన ర‌ఘురామ‌కృష్ణరాజుకు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్ ఇచ్చేసిన‌ట్లే. అలాగే న‌ర‌స‌రావుపేట నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన లావు శ్రీ‌కృష్ణ‌దేవరాయ‌లును కూడా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నితో స‌ఖ్య‌త లేద‌ని స్థానం మారుస్తామ‌ని వైసీపీ అధిష్టానం సూచించింది. దీంతో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయ‌న లోకేష్ త‌దిత‌ర టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. అక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే పోటీ చేయ‌డం ఖాయం. అలాగే మ‌చిలీప‌ట్నం నుంచి వైసీపీ జెండాపై నెగ్గిన వ‌ల్ల‌భ‌నేని బాలశౌరి కూడా పార్టీ వీడారు. ఆయ‌న జ‌న‌సేన‌లో చేరినా కూట‌మి అభ్య‌ర్థి కాబ‌ట్టి టీడీపీకి ఇక్క‌డా అభ్య‌ర్థిని వెతుక్కునే ప‌నిలేదు.

ఇంకా వ‌స్తార‌ని ఎదురుచూపులు

మ‌రోవైపు ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డికి ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ తెగేసి చెప్పేశారు. మాగుంట కోసం సీఎం ద‌గ్గ‌ర బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఎంత ప‌ట్టుబ‌ట్టినా జ‌గ‌న్ నో అనేశారు. ఎంపీ సీటు వైసీపీలో ద‌క్క‌క‌పోతే మాగుంట టీడీపీ వైపే వ‌స్తార‌ని ఆ పార్టీ ఆశ‌గా చూస్తోంది. ఇలా క‌న‌ప‌డిన ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ అభ్య‌ర్థినే టీడీపీ గుర్తు మీద పోటీ చేయిస్తే జ‌నాల్లో ప‌లుచ‌న అయిపోతామ‌ని టీడీపీ క్యాడ‌ర్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇన్నాళ్లూ ప్ర‌తిప‌క్షంలో ఉండి పోరాడిన వారిలో ఎవ‌రో ఒక‌ర్ని అభ్య‌ర్థిగా నిల‌బెట్టొచ్చు క‌దా అని ప్ర‌శ్నిస్తున్నారు. వాళ్ల ఆవేద‌న వినేదెవ‌రు..?

Tags:    
Advertisement

Similar News