జగన్ ఫొటోపై బీజేపీ రాజకీయం.. కొడాలి ఫైర్

పేదవాళ్లకు జగన్ పాలు పోస్తున్నారంటూనే ఫొటోలో పిల్లాడి చేతిలో డమరుకాన్ని పెట్టడం ద్వారా శివుడికే జగన్ పాలు తాగిస్తున్నారన్న భావన వచ్చేలా చిత్రీకరించారని సోము వీర్రాజు అభ్యంతరం తెలిపారు.

Advertisement
Update:2023-02-19 19:38 IST

శివరాత్రి రోజున వైసీపీ షేర్ చేసిన ఒక ఫొటోపై బీజేపీ మ‌త‌ రాజకీయం మొదలుపెట్టింది. గుడి వద్ద పిల్లాడికి సీఎం జగన్‌ పాలు పట్టిస్తున్నట్టుగా ఉన్న ఒక గ్రాఫిక్స్ ఫొటోను వైసీపీ షేర్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోపై బీజేపీ నేతలు సునీల్‌ ధియోధర్, సోమువీర్రాజు అభ్యంతరం తెలిపారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ మాఫియా పార్టీ, బెయిల్‌పై బయట తిరుగుతున్న సీఎం హిందూ పండుగలను అవమానిస్తున్నారని ధియోధర్ విమర్శించారు. కేవలం ఎన్నికల ముందు హిందువుల ఓట్లను సాధించేందుకు ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు.


పేదవాళ్లకు జగన్ పాలు పోస్తున్నారంటూనే ఫొటోలో పిల్లాడి చేతిలో డమరుకాన్ని పెట్టడం ద్వారా శివుడికే జగన్ పాలు తాగిస్తున్నారన్న భావన వచ్చేలా చిత్రీకరించారని సోము వీర్రాజు అభ్యంతరం తెలిపారు. బీజేపీ నేతల విమర్శలపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. అసలు మీరు మనుషులేనా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆకలితో ఉన్న వారికి జగన్ అన్నం పెడుతున్నారని.. పేదవాడికి అండగా ఉంటున్నారని.. ఆ అర్థంతో ఒక అభిమాని రూపొందించిన ఫొటోపై ఇలాంటి విమర్శలు ఏమిటని ప్రశ్నించారు. పెత్తందారులైన బీజేపీ నేతలు ఈ ఫొటోను వాడుకుంటూ మత రాజకీయాలు చేస్తున్నారని.. అసలు వీళ్లు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు.


చంద్రబాబు హయాంలో ఆలయాలను కూలిస్తే ఈ బీజేపీ నేతలు ఎక్కడున్నారని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ప్రతి విషయానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. సునీల్ ధియోధర్ ట్వీట్‌ చాలా అవమానకరంగా ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News