ఇక్కడ వీర్రాజు ఊస్టింగ్.. అక్కడ కిషన్ రెడ్డికి కొత్త పోస్టింగ్

కన్నా పోయి సోము వచ్చినా ఏపీ బీజేపీలో ఏమాత్రం ఉత్సాహం లేదు. కేడర్ నిరుత్సాహపడుతున్న వేళ అధ్యక్ష పదవిలో మార్పు కోరుకుంది అధిష్టానం.

Advertisement
Update:2023-07-04 15:15 IST

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల విషయంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి అనేది ఊహించిన విషయమే అయినా అధికారికంగా ఇప్పుడు ఆ స్థానం ఖరారైంది. ఇక ఏపీ విషయానికొస్తే అధ్యక్షుడు సోము వీర్రాజుపై అధిష్టానం వేటు వేసింది. దగ్గుబాటి పురంధ్రీశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరుని ఖరారు చేసింది అధిష్టానం. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ని పక్కనపెట్టింది. అంత మాత్రాన బండిని పూర్తిగా పార్టీ తీసిపారేసినట్టు కాదు, కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే ఎన్నికల వేళ ఈ మార్పు బండికి నిరాశ కలిగించేదే అని చెప్పాలి. ఆయన సమర్థతని అధిష్టానం తక్కువ చేసినట్టే అనుకోవాలి. కిషన్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ బీజేపీ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉన్న సమయంలో సోము వీర్రాజుని తొలగించింది అధిష్టానం. కన్నా పోయి సోము వచ్చినా ఏపీ బీజేపీలో ఏమాత్రం ఉత్సాహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు, కేడర్ నిరుత్సాహపడుతున్న వేళ అధ్యక్ష పదవిలో మార్పు కోరుకుంది అధిష్టానం. టీడీపీ, జనసేనతో కలసి వెళ్లే అవకాశాలున్న సందర్భంలో ఆ రెండు పార్టీలకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధ్రీశ్వరికి అవకాశమిచ్చింది.

ఏపీలో బలపడాలని, తెలంగాణలో ఏకంగా అధికారం చేపట్టాలనేది బీజేపీ కల. కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదు, అటు తెలంగాణలో కూడా విభజన హామీలు నెరవేర్చదు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీది ఇంకా సవతి తల్లి ప్రేమే. ఇలాంటి దశలో అధిష్టానం మైండ్ సెట్ మారకుండా, కేవలం అధ్యక్షులను మారిస్తే ప్రయోజనం ఉంటుందా అనేది అనుమానమే. 

Tags:    
Advertisement

Similar News