మరో సీటు అడుగుతున్న బీజేపీ.. త్యాగం చేసేది ఎవరు..?

సోము వీర్రాజు కోసం అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం.

Advertisement
Update:2024-03-26 20:19 IST

ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల‌ మధ్య సీట్ల పంపకాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. కాగా, తాజాగా మరో అసెంబ్లీ సీటు కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత, ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్.. బీజేపీ 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అయితే ఆ 11వ‌ స్థానం ఏంటనేది ఆయన చెప్పలేదు. దీంతో ఏ సీటు ఇస్తారు.. జనసేన, టీడీపీ ఎవరి కోటా నుంచి ఇస్తారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కడప జిల్లాలో మరో సీటును బీజేపీ కోరుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బద్వేలును బీజేపీకి కేటాయించగా.. తాజాగా రాజంపేట సీటును కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాజంపేట కుదరకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గం తమకు ఇవ్వాలని బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కడప జిల్లాలో ఓ సీటు జనసేనకు.. ఓ సీటు బీజేపీకి ఇచ్చినందున మరో సీటు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక సోము వీర్రాజు కోసం అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలు సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని ఇచ్చేందుకు కూడా టీడీపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. బుధవారం బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పదాధికారుల సమావేశానికి బీజేపీ సీనియర్ నేతలు విష్ణువర్ధన్‌ రెడ్డి, మాజీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహ రావు హాజరు కాలేదు. సీటు రాలేదన్న అసంతృప్తితోనే వీరంతా సమావేశానికి దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో సోము వీర్రాజుకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News