ఏపీలోని ఐదు లోక్‌సభ స్థానాలను టార్గెట్ చేసిన బీజేపీ

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర బీజేపీ, జనసేనాని పవన్ పట్టుబడుతున్నారు.

Advertisement
Update:2022-07-28 18:21 IST

కేంద్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమి పేరుతో అధికారంలోకి వచ్చినా.. బీజేపీ వల్లే అది సాధ్యమైంది. రెండు సార్లు కూడా అధికారంలోకి రావడానికి ఉత్తరాది రాష్ట్రాల‌ బలమే కారణమైంది. దక్షిణాదిలో కర్నాటక తప్ప మరో రాష్ట్రంలో బీజేపీకి అంతగా పట్టులేదు. తెలంగాణలో ఈ మధ్య తన ఉనికిని చాటుకుంటోంది. టీఆర్ఎస్‌ను పడగొట్టి రాష్ట్రంలో పాగా వేయాలనేది బీజేపీ స్కెచ్. కానీ అందుకు చాలా కష్టపడాలి.

ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ అక్కడ తిరుగులేని శక్తిగా మారింది. ఇప్పట్లో ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు. కానీ, రాబోయే ఎన్నికల్లో సాధ్యమైనన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఏపీలోని ఐదు నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని.. వాటిని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి పార్లమెంటు స్థానాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి ఆ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీలోగానీ.. విభజన అనంతరం గానీ ఒంటరిగా పోటీ చేసి సీట్లు గెలవలేదు. 1999లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తిరుపతి, నర్సాపురం, రాజమండ్రి స్థానాలను గెలుచుకుంది. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో నర్సాపురం, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది.

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర బీజేపీ, జనసేనాని పవన్ పట్టుబడుతున్నారు. అయితే పొత్తులు ఉన్నా, లేకపోయినా.. ఐదు లోక్‌సభ స్థానాలను మాత్రం గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పొత్తుల కోసం ఎదురు చూడవద్దని.. ఇప్పటి నుంచే విశాఖ, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి స్థానాల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని అధిష్టానం ఆదేశించింది.

కొంత కాలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీ కేంద్ర నాయకత్వం క్లోజ్‌గా ఉంటోంది. ఇది తమకు ఇబ్బందిగా మారిందని, పలుచోట్ల దూకుడుగా వ్యవహరించలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలన్నీ మారిపోతాయని.. దాని గురించి పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేనతో పొత్తు కుదిరితే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న స్థానాలను ఆ రెండు పార్టీలు వదులుకుంటాయా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఏదేమైనా ఇప్పటికి మాత్రం అధిష్టానం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయ‌డానికి ఏపీ బీజేపీ సిద్ధ‌మవుతోంది.

Tags:    
Advertisement

Similar News